ఎన్నారై భర్తలకు కేంద్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. కట్టుకున్న భార్యలను స్వదేశంలో వదిలిపెట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న 25 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులను రద్దు చేసింది. ఈ విషయాన్ని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దీనిపై డబ్ల్యూసీడీ అధికారులు స్పందిస్తూ, ఇలాంటి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. భార్యలను స్వదేశంలో విడిచిపెడితే భర్తలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేరాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో పాస్‌పోర్టులను రద్దు చేయడంతో పాటు కొన్ని కేసుల్లో లుకౌట్ నోటీసులు కూడా జారీచేసే అవకాశం ఉందని తెలిపారు.
క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని అరెస్టు నుంచి ఉద్దేశ్యపూర్వకంగా తప్పించుకోవడంతో పాటు కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న ఎన్నారై భర్తలకు దర్యాప్తు సంస్థలు లుకౌట్ నోటీసులు జారీచేసే అధికారం ఉందని ఆయన తెలిపారు.