ఆప్ఘనిస్థాన్‌లోని భారత ఆస్తులను ధ్వంసం చేయాల్సిందిగా తాలిబన్ తీవ్రవాదులకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సూచన చేసింది. ఆప్ఘాన్‌ను అమెరికా సారథ్యంలోని సంకీర్ణ బలగాలు వీడి వెళ్లిన తర్వాత పాకిస్థాన్ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లోకి సుమారు 10 వేల మంది ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం.
వీళ్లలో కొంతమంది ఎప్పటి నుంచో ఆఫ్ఘనిస్థాన్‌లోనే ఉంటూ అమెరికా దళాలకు వ్యతిరేకంగా ఫైట్ చేశారు. 2001లో ఆఫ్ఘనిస్థాన్‌పై తాలిబన్లు పట్టు కోల్పోయినప్పటి నుంచీ ఇప్పటివరకూ భారత్ ఆ దేశంలో 300 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది.
జారంజ్, డెలారామ్ మధ్య ఉన్న 218 కి.మీ. రోడ్డు, ఇండియా - ఆఫ్ఘనిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ (సల్మా డ్యామ్), ఆఫ్ఘన్ పార్లమెంట్ బిల్డింగ్‌లాంటివి ఇండియా అక్కడ నిర్మించింది. తాలిబన్లు తిరిగి రావడంతో ఆ దేశంలో భారత్ ఉనికి కొనసాగుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌లో గత 20 ఏళ్లుగా భారత్ నిర్మించిన భవనాలు, మౌలిక వసతులే లక్ష్యంగా దాడి చేయండంటూ అక్కడి తాలిబన్లు, పాకిస్థాన్ ఫైటర్లకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సూచించింది.
ఆప్ఘనిస్థాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తాలిబన్లకు మద్దతు ఇప్పటికే చాలా మంది పాకిస్థాన్ ఫైటర్లు వాళ్లతో చేతులు కలిపారు. వాళ్లందరికీ ఇప్పుడు భారత ఆస్తులే లక్ష్యంగా దాడులు చేయాలన్న ఆదేశాలు అందాయి అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని భారత ఆస్తులే లక్ష్యంగా దాడులు జరగబోతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీనిపై తాలిబన్ల నుంచి ఎలాంటి హామీ ఇప్పటివరకూ భారత ప్రభుత్వానికి రాలేదు. ఇప్పటికే అక్కడ పని చేస్తున్న భారత వర్కర్లను దేశం వదిలి వచ్చేయాల్సిందిగా భారత ప్రభుత్వం సూచించింది.