అమెరికా ఎయిర్‌షోలో ఘోరం జరిగింది. ఆకాశంలో విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్‌లో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో విమానాలను నడుపుతున్న పైలట్లతో సహా ఆరుగురు మరణించివుంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో ఒకటి రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి విమానం కావడం గమనార్హం.
ఎయిర్‌షోలో పాల్గొన్న బోయింగ్ బి17 యుద్ధ విమానం, పీ63 కింగ్ కోబ్రా విమానం రెండూ ఆకాశంలో విన్యాసాలు ప్రారంభించాయి. వైమానిక ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన సందర్శకులు ఈ విమానాల విన్యాసాలను తమతమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసుకుంటున్నాయి.
ఇంతలో బోయింగ్ బీ17 విమానం వైపు వేగంగా దూసుకొచ్చిన కింగ్ కోబ్రా విమానం క్షణాల్లో దాన్ని ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో కింగ కోబ్రా విమానం పేలిపోయింది. బోయింగ్ విమానం నేలకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదం మొత్తం సందర్శకుల ఫోన్లలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.