నేతాజీ మరణ రహస్యం : విమాన ప్రమాదంలో చనిపోయారట.. 60 యేళ్లనాటి రిపోర్టు బహిర్గతం
భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉన్న మిస్టరీ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. నేతాజీ మరణ కారణాలను ఆధార సహితంగా తెలుసుకునేందుకు ఏర్పాటైన బ్రిటన్ వెబ్‌సైట్ Bosefiles.info ఈ వ
భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉన్న మిస్టరీ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. నేతాజీ మరణ కారణాలను ఆధార సహితంగా తెలుసుకునేందుకు ఏర్పాటైన బ్రిటన్ వెబ్‌సైట్ Bosefiles.info ఈ వివరాల్ని బయటపెట్టింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తమ వద్ద ఉన్న కొన్ని విషయాలను కూడా బహిర్గతం చేసింది. కానీ, వీటిలో ఎక్కడా కూడా నేతాజీ మరణంపై స్పష్టత అనేది కనిపించలేదు.
ఈ నేపథ్యంలో నేతాజీ మరణంపై 60 ఏళ్ల క్రితం నాటి జపాన్ ప్రభుత్వ విచారణ నివేదిక శుక్రవారం వెలుగుచూసింది. ఆగస్టు 18, 1945న తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని ఆ రహస్య పత్రాల్లో ఉంది. ఈ నివేదికను 1956లో టోక్యోలోని భారత రాయబార కార్యాలయానికి సమర్పించారని తెలిపింది. తైవాన్‌లో విమాన ప్రమాదానికి గురైన నేతాజీ... తైపీ ఆస్పత్రిలో అదే రోజు సాయంత్రం మరణించారని వెల్లడించింది.
ప్రమాదం జరిగిన రోజున.. 'విమానం 20 మీటర్ల ఎత్తుకు ఎగరగానే ఎడమవైపు రెక్కలోని పెటల్ విరగడంతో ఇంజిన్ ఆగిపోయింది. దాంతో విమానం అదుపుతప్పి... కింద ఉన్న కంకర రాళ్లపై పడింది. క్షణాల్లో మంటల్లో చిక్కుకుంది. మంటలు అంటుకోవడంతో బోస్ కిందకు దూకేశారు. కల్నల్ రెహమాన్, ఇతర ప్రయాణికులు నేతాజీ బట్టలు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన శరీరం తీవ్రంగా కాలిపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాన్‌మన్ బ్రాంచ్ ఆఫ్ తైపీ ఆర్మీ ఆస్పత్రిలో చేర్చగా... రాత్రి 7 గంటల సమయంలో మరణించారు. ఆగస్టు 22న తైపీ మున్సిపల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు’ అని విచారణ నివేదికలో పేర్కొన్నారు.