Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మ్యాగీ'ని అరుణ గ్రహంపైకి పంపించనున్న 'నాసా'

Advertiesment
maggie plane

వరుణ్

, మంగళవారం, 23 జనవరి 2024 (10:46 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. భారీ రెక్కులు ఉండే మ్యాగీ విమానాన్ని అరుణ గ్రహంపైకి పంపించేందుకు సిద్ధమైంది. అంగారకుడిపై నీటి జాడల కోసం నాసా ఈ పరిశోధనలు జరుపనుంది. సౌర శక్తి ఆధారిత విమానానికి రూపకల్పన ప్రతిపాదనల దశలో ఈ మ్యాగీ విమానం ఉంది. 
 
అరుణ గ్రహంగా పేరుగాంచిన అంగారకుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించేందుకు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులోభాగంగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంగారక గ్రహంపైకి భారీ రెక్కలుండే విమానాన్ని పంపించాలని భావిస్తుంది. ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ విమానం పేరు మ్యాగీ. మార్స్ ఏరియల్ అండ్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ ప్లోరర్ (The Mars Aerial and Ground Intelligence Explorer)కు సంక్షిప్త రూపమే MAGGIE. ఇది సౌర శక్తి ఆధారిత విమానం.
 
సాధారణంగా విమానాలకు ఉండే రెక్కలను టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో వేగం నియంత్రణ, దిశ నియంత్రణ కోసం కదిల్చే వీలుంటుంది. కానీ మ్యాగీకి అమర్చే భారీ రెక్కలు ఎటూ కదలకుండా స్థిరంగా ఉంటాయి. విమానం సౌర శక్తిని గ్రహించేందుకు వీలుగా ఈ రెక్కలపై సోలార్ ప్యానెళ్లను అమర్చనున్నారు.
 
వెర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ఈ విమానం ప్రత్యేకత. అంటే, హెలికాప్టర్ తరహాలో నిట్టనిలువుగా గాలిలోకి లేస్తుంది, దిగుతుంది. మ్యాగీలోని బ్యాటరీలు ఒక్కసారి చార్జ్ అయితే ఏకబిగిన 179 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంగారకుడి కాలమానం ప్రకారం ఒక ఏడాదిలో ఇది 16 వేల కిలోమీటర్లు ప్రయాణించేలా రూపొందించారు. అంగారకుడిపై ఒక ఏడాది అంటే భూమిపై రెండేళ్ల కాలంతో సమానం.
 
మ్యాగీ సాయంతో మూడు రకాల పరిశోధనలు చేపట్టాలని నాసా భావిస్తోంది. నీటి జాడను పసిగట్టడం, అంగారక గ్రహ బలహీన అయస్కాంత క్షేత్ర మూలాలను గుర్తించడం, మీథేన్ సంకేతాలను గుర్తించడం దీని ప్రధాన లక్ష్యాలు. ఈ సోలార్ ప్లేన్ అరుణ గ్రహం ఉపరితలంపై 1000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఈ విమానం ప్రతిపాదనల దశలో ఉన్నప్పటికీ, నాసా ఇటీవలే నిధులు విడుదల చేయడం చూస్తుంటే త్వరలోనే కార్యరూపం దాల్చనున్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య రామ జన్మభూమి ట్రస్టుకు ముఖేశ్ అంబానీ భారీ విరాళం