బ్రిటన్‌లో బ్లాక్ మార్కెట్ విస్తరిస్తోంది.. గంజాయిని చట్టబద్ధం చేయండి.. ప్రధానితో ఎంపీలు
బ్రిటన్‌లో గంజాయిని చట్టబద్దం చేసేందుకు డిమాండ్ పెరిగిపోతోంది. బ్రిటన్‌లో గంజాయిని అరికట్టడం కంటే క్రమబద్ధీకరణ.. చట్టబద్ధతతో ఆదాయం సమకూరుతుందని బ్రిటన్ సీనియర్ ఎంపీలు ప్రధాన మంత్రి థెరెసాకు విజ్ఞప్తి
బ్రిటన్‌లో గంజాయిని చట్టబద్దం చేసేందుకు డిమాండ్ పెరిగిపోతోంది. బ్రిటన్‌లో గంజాయిని అరికట్టడం కంటే క్రమబద్ధీకరణ.. చట్టబద్ధతతో ఆదాయం సమకూరుతుందని బ్రిటన్ సీనియర్ ఎంపీలు ప్రధాన మంత్రి థెరెసాకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఏడాది 680 కోట్ల బ్రిటన్ పౌండ్ల(దాదాపు 58 వేల కోట్ల రూపాయలు) గంజాయి అక్రమ వ్యాపారం జరుగుతుంది.
అదే ఈ వ్యాపారాన్ని క్రమబద్ధీకరిస్తే 75 కోట్ల పౌండ్ల (రూ.6.3 వేల కోట్లు) నుంచి 100 కోట్ల పౌండ్లు(రూ. 8.3 వేల కోట్లు) పన్ను రూపంలో వస్తాయని ఎంపీలు సలహా ఇస్తున్నారు. మాదక ద్రవ్యాల నిషేధం వల్ల బ్లాక్ మార్కెట్ విస్తరించిందని, చట్టాలు పని చేయడంలేదన్నారు. దీనిపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని, మత్తు పదార్థాలను తీసుకోవడాన్ని నేరంగా కాకుండా ఓ అనారోగ్యంగా చూడాలని తెలిపారు. ఇటీవల జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఈ విషయం తేటతెల్లమైందని చెప్పారు. అందుకే గంజాయిని నియంత్రించడం కంటే చట్టబద్ధత చేయడమే మేలని చెప్పుకొచ్చారు.