భారత ప్రధానికి ఇజ్రాయెల్ అపూర్వ గౌరవం... తరలివచ్చిన నెతన్యాహూ మంత్రివర్గం
దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లిన తొలి భారత ప్రధాని నరేంద్రమోదీకి అపూర్వ స్వాగతం లభించింది. 3 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఇజ్రాయెల్ చేరుకున్న మోదీని సాదరంగా ఆహ్వానించేందుకు టెల
దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లిన తొలి భారత ప్రధాని నరేంద్రమోదీకి అపూర్వ స్వాగతం లభించింది. 3 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఇజ్రాయెల్ చేరుకున్న మోదీని సాదరంగా ఆహ్వానించేందుకు టెల్ అవివ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పాటు ఆయన కేబినెట్ మొత్తం తరలి వచ్చింది.
మోదీ విమానం దిగగానే ఇరు ప్రధానులు ఒకరి నొకరు మూడుసార్లు ఆలింగనం చేసుకున్నారు. ఇజ్రాయెల్ సైనిక బృందం ఇరు దేశాల జాతీయ గీతాల్ని ఆలపించి మోదీకి సైనిక వందనం సమర్పించింది. ‘ఆప్ కాస్వాగత్ హై, మేరే దోస్త్’ అంటూ హిందీలో మోదీకి నెతన్యాహూ స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు, పోప్‌కు మాత్రమే లభించే గౌరవం ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి దక్కింది.
అనంతరం మోదీ, నెతన్యాహూ ఎయిర్‌పోర్టులో సంక్షిప్తంగా ప్రసంగించారు. ‘ఇది నిజంగానే చారిత్రక పర్యటనే, గత 70 ఏళ్లుగా భారత ప్రధాని రాక కోసం వేచిచూస్తున్నాం.. భారత్‌కు చెందిన గొప్ప నేత, ప్రపంచంలో ప్రముఖ నేత మోదీ’ అంటూ నెతన్యాహూ ఉద్వేగంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు మోదీని నా స్నేహితుడని సంబోధించారు. ‘భారత్‌ను ప్రేమిస్తున్నాం. ఆ దేశంతో సహకారంలో ఇక నుంచి ఆకాశమనే హద్దును కూడా చేరిపేస్తున్నాం. భారత్, ఇజ్రాయెల్ సంబంధాల్లో ఆకాశమే హద్దని మా మొదటి సమావేశంలో మోదీ చెప్పిన విషయం గుర్తుంది. ఇప్పుడు మనం అంతరిక్ష రంగంలో కూడా సహకరించుకుంటున్నాం.. అందువల్ల ఆకాశం కూడా ఇక అడ్డంకి కాద’ని నెతన్యాహూ పేర్కొన్నారు.
ఘన స్వాగతానికి మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ.. హిబ్రూలో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘షాలోమ్(హలో).. ఇక్కడికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. విమానాశ్రయంలో స్వాగతం పలికిన నా స్నేహితుడు నెతన్యాహూకు కృతజ్ఞతలు. నా పర్యటన భవిష్యత్తులో మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిని నేను కావడం గౌరవంగా భావిస్తున్నా. ఇజ్రాయెల్‌తో దృఢమైన సంబంధాలు ఏర్పరచుకోవడమే నా పర్యటన లక్ష్యం. ఇరు దేశాలకు ఉమ్మడి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం నుంచి మన సమాజాల్ని కాపాడుకోవాలి. కలసికట్టుగా పనిచేస్తే మరింత ముందుకు సాగడంతో పాటు అద్భుతాలు సాధిస్తాం. భారత్‌లో ఎంతో యువ శక్తి ఉంది. ఇరు దేశాల్లో తెలివైన, నైపుణ్యమున్న యువతరం ఉంది. వారే మన చోదకశక్త’ని మోదీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ను కీలకమైన అభివృద్ధి భాగస్వామిగా అభివర్ణించారు.