2018 సంవత్సరానికి గాను మిస్ వరల్డ్‌గా మెక్సికో ముద్దుగుమ్మ వనెస్సా పోన్స్ డీ లియోన్ అనే 26 యేళ్ళ ముద్దుగుమ్మ ఎంపికైంది. చైనాలోని సాన్యా నగరం ఈ అందాల వేడుకకు వేదికైంది. వివిధ దేశాలకు చెందిన 118 మంది భామలు కిరీటం కోసం పోటీపడ్డారు. గత ఏడాది మిస్ వరల్డ్‌గా నిలిచిన భారత సుందరి మానుషి చిల్లర్ ఆహూతులు కరతాళధ్వనుల మధ్య కిరీటాన్ని వనెస్సాకు అలంకరించగా ఆమె ఆశ్చర్యానికి లోనయ్యారు.
దీనిపై ఆమె స్పందిస్తూ 'నేను నమ్మలేక పోతున్నా ఇది నిజమా..! ఈ కిరీట ధారణకు యువతులందరూ అర్హులే. వారందరి తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు' అని ఆమె ఉద్వేగంగా చెప్పారు.
కాగా, ఈ పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన నికోలిన్ పిచాప లిమ్స్‌నుకన్ (20) రన్నరప్‌గా నిలిచారు. టాప్-5లో బెలారస్, జమైకా, ఉగాండాలకు చెందిన సుందరాంగులున్నారు. మన దేశానికి చెందిన ఫెమినా మిస్ ఇండియా-2018 అనుకీర్తి వ్యాస్ (తమిళనాడు) తీవ్ర నిరాశ పర్చారు. ఆమె టాప్-30లో 19వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇదిలావుంటే, విశ్వసుందరిగా ఎన్నికైన మెక్సికో భామకు సాహస కృత్యాలంటే వెన్నతో పెట్టిన విద్య. ఆమె ఓపెన్ వాటర్ స్కూబా డైవర్. అలాగే వాలీబాల్ అంటే ఇష్టం. పెయింటింగ్స్ వేస్తారు. ఫిర్స్‌బీ ఆటలోనూ ప్రవీణ్యురాలు. ఇంటర్నేషనల్ బిజినెస్‌లో వనెస్సా డిగ్రీ పూర్తిచేశారు. వలస ప్రజలు ముఖ్యంగా బాలికల హక్కుల కోసం కృషిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థలో ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు. మోడల్‌గా, ప్రయోక్తగానూ ఆమె రాణిస్తున్నారు.