సాధారణంగా తమ ప్రియుడు, ప్రియురాలి పుట్టిన రోజులకు ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం సహజం. ముఖ్యంగా ప్రియురాలి బర్త్‌డేకు విలువైన గిఫ్టులిచ్చిన సర్‌ప్రైజ్ చేయాలని ప్రియుడు భావిస్తుంటారు. అలా, ఓ ప్రియుడు.. తన ప్రియురాలి పుట్టిన రోజుకు ఏకంగా ఓ ఒంటె పిల్లను దొంగిలించి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఈ ప్రేమికులిద్దరూ జైలుపాలయ్యారు. ఈ ఘటన దుబాయ్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ ప్రియుడు తన ప్రియురాలి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని అరుదైన, అత్యంత విలువైన అపుడే జన్మించిన ఒంటె పిల్లను బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆ ప్రియురాలు కూడా తెగ సంతోషపడింది.
ఈ క్రమంలో తన ఒంటె పిల్ల కనిపించడం లేదని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణ చేపట్టారు. ఇంతలో ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి.. తన ఫామ్‌హౌస్‌లో ఓ ఒంటె పిల్ల తిరుగుతుందని సమాచారం అందించాడు.
అయితే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫామ్‌హౌస్‌ల మధ్యే ఒంటె గల్లంతైనట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవలే జన్మించిన ఒంటె అంతదూరం నడిచి రావడంపై సందేహాలు రావడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
తాను ఆ ఒంటెను దొంగిలించానని, అరుదైన ఖరీదైన ఒంటెను తన గర్ల్‌ఫ్రెండ్‌కు బహుమతిగా ఇచ్చేందుకు ఈ పని చేశానని అనుమానితుడు అంగీకరించాడు. ఒంటెను తిరిగి యజమానికి అప్పగించిన పోలీసులు నిందితుడితో పాటు అతడి గర్ల్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేశారు. చోరీ, తప్పుడు స్టేట్‌మెంట్‌లు ఇచ్చినందుకు వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.