జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడాఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గత యేడాది ప్రకటించింది. అప్పటి నుంచి అటు పాకిస్థాన్, ఇటు చైనాలు ఏదో విధంగా ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉన్నాయి. తాజాగా చైనా చేసిన ప్రకటన భారత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. లడాఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం గుర్తించమని చైనా వెల్లడించింది. అక్రమ రీతిలో భారత ప్రభుత్వం లడాఖ్‌ను యూటీగా చేసినట్లు చైనా ఆరోపించింది.
ఇటీవలి కాలంలో భారత్ - చైనా దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనివున్న నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ చేసిన ప్రకటన ఇపుడు పుండుమీద కారం చల్లినట్టేనని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయడుతున్నారు. గత కొన్ని నెలల నుంచి ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. జూన్ 15వ తేదీన వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి దశలవారీగా బలగాలను తరలిస్తూ వచ్చిన చైనా.. ప్రస్తుతం ఏకంగా 60 వేల మంది బలగాలను సరిహద్దుల వెంబడి మొహరించిందని అమెరికా మంత్రి పాంపియో వెల్లడించారు. లడాఖ్ సరిహద్దుల్లో ఉన్న టెన్షన్ వాతావరణాన్ని తగ్గించేందుకు ఇటీవల రెండు దేశాలకు చెందిన సైనిక, దౌత్య అధికారులు చర్చలు కూడా నిర్వహించారు. కానీ ఇంకా సమస్య కొలిక్కిరాలేదు. అయితే తాజాగా లడాఖ్‌ను యూటీగా గుర్తించమని చైనా ప్రకటన చేయడం గమనార్హం.