బడ్జెట్ ఆమోదంలో విఫలం కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంత ఆ దేశంలో మళ్లీ సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. గత రెండేళ్లలో ఇజ్రాయెల్‌లో ఎన్నికల జరుగుతుండడం ఇది నాలుగోసారి.
గత యేడాది ఏప్రిల్ నెలలో బెన్నీ గాంట్జ్ నేతృత్వంలోని బ్లూ అండ్ వైట్ పార్టీతో కలిసి నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి పదవిని పంచుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. 18 నెలలు నెతన్యాహు ప్రధానిగా పనిచేసిన అనంతరం బ్లూ అండ్ వైట్ పార్టీకి పగ్గాలు అప్పగించాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒప్పందం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
అయితే, ఇటీవల ఇరు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కనీసం బడ్జెట్ కూడా ఆమోదింప చేసుకోలేని పరిస్థితి వచ్చింది. దీంతో పార్లమెంటు రద్దయింది. ఇరు పార్టీలు పరస్పరం తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి.
కరోనా విజృంభణ సమయంలో బ్లూ అండ్ వైట్ పార్టీ ప్రభుత్వం కూలిపోయేలా వ్యవహరించిందంటూ నెతన్యాహు విమర్శించారు. అయితే, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నెతన్యాహు సొంత ప్రయోజనాలను చూసుకుంటున్నారంటూ బ్లూ అండ్ వైట్ పార్టీ విమర్శలు గుప్పించింది.
కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఏడాది మార్చి 23న తిరిగి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ పార్లమెంట్ అర్థాంతరంగా కుప్పకూలిపోవడంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కరోనా సంక్షోభంలో ఇలాంటి పరిస్థితి ఉత్పన్న కావడంతో రాజకీయ మేధావులు ఆందోళన చెందుతున్నారు.