Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనాకూ ఉత్తర కొరియా అంటే భయమా?

Advertiesment
కరోనాకూ ఉత్తర కొరియా అంటే భయమా?
, సోమవారం, 23 మార్చి 2020 (08:04 IST)
అమెరికా, ఇంగ్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాలకు కంట్లో నలుసులా మారిన ఉత్తర కొరియా కరోనాకూ చెమటలు పట్టిస్తోందా?.. అందుకే ఆ వైరస్ ఆ దేశం వైపు చూడట్లేదా?..

ప్రపంచంలోని దేశాలన్నీ కరోనా కేసుల సంఖ్య చెబుతుంటే ఉత్తర కొరియా మాత్రం నోరు పెగల్చడం లేదెందుకు?... ఇంతకీ అక్కడ కరోనా లేదా? లేక కరోనా ప్రభావం గురించి ఆ ప్రభుత్వం బయటకు చెప్పుకోవడం లేదా?... ఇవీ ప్రస్తుతం ప్రపంచ దేశాల్ని తొలుస్తున్న ప్రశ్నలు...
 
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల 3 వేల 659 మంది కరోనా బారిన పడగా.. 13 వేల 424 మంది మృత్యువాతపడ్డారు. 160కు పైగా దేశాలు కరోనాను ఎలా నియంత్రించాలో తెలియక సతమతమవుతున్నాయి. ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచిన హెల్త్ సిస్టమ్స్ ఉన్న దేశాలకు కూడా కరోనా పాకింది. అయితే ఉత్తర కొరియాలో మాత్రం ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు అవలేదట.

ఒకవేళ ఉత్తర కొరియాలో నిజంగానే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోతే.. ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రపంచానికి ఎటువంటి సందేశాన్ని ఎందుకు ఇవ్వలేకపోతోంది? ఉత్తర కొరియాకు ఆనుకుని ఉన్న సౌత్ కొరియాలోని విశ్లేషకులు, వైద్య నిపుణులు ఇప్పడు ఈ అంశం గురించే ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియాలో ఇప్పటికే అనేక మందికి కరోనా సోకిందనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

‘ఉత్తర కొరియా ప్రభుత్వం సరిహద్దులను మూసివేసింది. చైనీయులు, ఇతర విదేశీయులను దేశంలోకి రాకుండా అడ్డుకట్ట వేసింది. అయితే ఈ పనులన్నీ చేయకముందే ఉత్తర కొరియాలో చాలా మందికి కరోనా సోకింది. ఉత్తర కొరియా మెడికల్ సిస్టమ్ పెద్దగా అభివృద్ధి చెందకపోవడంతో కరోనా బాధితులను కనిపెట్టడం కూడా కష్టం’ అని నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీస్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రో క్యూంగ్ సంచలన ప్రకటన చేశారు.

అయితే ఉత్తర కొరియాలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డారా లేదా అన్నది అధికారికంగా ఏ ఒక్కరికి తెలీదు. కాగా.. ఇటీవల ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఓ లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 8,897 మంది కరోనా బారిన పడ్డారు. 104 మంది మృతిచెందారు.

ఇటువంటి సమయంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పుకుంటున్న ఉత్తర కొరియా దక్షిణ కొరియాకు ఏం లేఖ రాసి ఉంటుందన్న చర్చ మొదలైంది. ఈ లేఖకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఆ లేఖలో కరోనా అంశం గురించే కిమ్ జాంగ్ ప్రస్తావించారని దక్షిణ కొరియా ప్రభుత్వంలోని సీనియర్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు.

కరోనా నుంచి దక్షిణ కొరియా త్వరగా విముక్తి చెందాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తన లేఖలో ముఖ్యంగా ప్రస్తావించారని ఆయన అన్నారు. అయితే ఇంతకాలంగా కరోనా గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయని కిమ్.. ఇప్పుడు దక్షిణ కొరియా అధ్యక్షుడికి లేఖ రాయడంపై సర్వత్రా ఆసక్తి కలుగుతోంది. ఉత్తర కొరియా కరోనా నుంచి బయట పడేందుకు సహాయం చేయమంటూ కిమ్ జాంగ్ దక్షిణ కొరియాను విజ్ఞప్తి చేస్తూ ఆ లేఖ రాశారని కూడా పలువురు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిమ్ జాంగ్‌కు ఇటీవల ఓ లేఖ పంపించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే ప్రణాళిక, కరోనాను కలిసికట్టుగా ఎదుర్కోవడం వంటి అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖకు సమాధానంగా కిమ్ జాంగ్ మరో లేఖను ట్రంప్‌కు రాశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు ప్రణాళికను లేఖలో చెప్పుకొచ్చారు. అదే విధంగా కరోనా వ్యాప్తిని ఆపేందుకు పూర్తి సహకారం అందిస్తానంటూ కిమ్ జాంగ్ హామీ ఇచ్చారు.
 
అసోసియేషన్ ఆఫ్ నార్త్ కొరియా డిఫెక్టర్స్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సీయో జే ప్యూంగ్ మాత్రం తనకు ఉత్తర కొరియాలో నివసిస్తున్న వారి నుంచి అనేక సమాచారం వచ్చిందని చెబుతున్నారు. ఆయన ఏమన్నారంటే.. ‘నేను ఉత్తర కొరియాలో ఉన్న చాలా మందితో మాట్లాడాను. ప్రస్తుతం ఉత్తర కొరియా ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించినట్టు నాకు సమాచారం అందింది.

ఉత్తర కొరియాలో జనవరి 27న మొదటి కరోనా కేసు నమోదైనట్టు విన్నాను. అధికారులు దేశవ్యాప్తంగా రవాణా సంస్థను మూసివేశారు. ప్రజలు రోడ్లపై కూడా తిరగకూడదని నిబంధనలు విధించినట్టు నాకు తెలిసింది. ఇంత జరుగుతున్నా ఉత్తర కొరియా ప్రజలకు మాత్రం ఇప్పటికీ కరోనా వైరస్‌పై పూర్తి అవగాహన లేదు. మిగతా వ్యాధుల మాదిరిగా ఇది కూడా ఒక వ్యాధి అనే భావనలోనే ఉన్నారు’ అని సియో జే ప్యూంగ్ పేర్కొన్నారు.

అయితే ఈ సమాచారం మొత్తం నిజమా కాదా అని నిర్థారించాలంటే మాత్రం కష్టంతో కూడుకున్న వ్యవహారమన్నారు. ఉత్తర కొరియాలోకి ఇప్పటికే చైనా, దక్షిణ కొరియా నుంచి మాస్క్‌లు అక్రమంగా వెళ్లినట్టు తనకు సమాచారం వచ్చిందని సియో జే ప్యూంగ్ తెలిపారు. టెస్ట్ కిట్స్ కూడా తక్కువగా ఉండటంతో.. కేవలం లక్షణాలున్న వారిని మాత్రమే వైద్యులు పరీక్షిస్తున్నట్టు తెలిసిందన్నారు. 
 
1990 వరకు ఉత్తర కొరియా హెల్త్‌కేర్ సిస్టమ్ బలంగానే ఉండేది. అయితే ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక సమస్యలు, ఆహారం, ఇంధన కొరత ఇలా పలు కారణాల వల్ల హెల్త్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింది. 2001కి అనేక ఆసుపత్రులలో కనీసం సరైన సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని ఆసుపత్రులలో మంచి ఎక్విప్‌మెంట్ ఉన్నప్పటికి.. అక్కడ ఇందన లోపం శాపంగా మారింది.

ఇలాంటి పరిస్థితుల మధ్య ఉత్తర కొరియా హెల్త్ సిస్టమ్ కరోనాను సమర్థంగా ఎలా ఎదుర్కొని నిలబడిందనేది విశ్లేషకులు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. గత సంవత్సరం వచ్చిన హరికేన్ లింగ్లింగ్, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా ఉత్తర కొరియా అతలాకుతలమైపోయిందని, ఇప్పుడు కరోనా కారణంగా పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశముందని రాబర్ట్ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో మరో కరోనా కేసు.. డీఎస్పీ కుమారుడికి కరోనా..