ఇండియా-అమెరికా మధ్య ఉన్న సంబంధాల గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘమైన, బలమైన సంబంధాలు ఉన్నాయని, కొవిడ్ నుంచి ఇండో-పసిఫిక్ అంశాల వరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమయ్యారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్‌లో వీరి సమావేశం జరిగింది.
అధ్యక్షుడిని కలిసే ముందు ఉపాధ్యక్షులు కమలా హారీస్‌తో మోదీ సమావేశమయ్యారు. కాగా, ఇరు నేతలు ఇరు దేశాలకు సంబంధించి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ముందు బైడెన్ మీడియాతో మాట్లాడారు.