అదృష్టమంటే అలా ఉండాలి. అమెరికాలో మరో మూణ్ణెల్ల చాన్స్
అమెరికాలో గత 15 ఏళ్లుగా న్యూరాలజిస్టులుగా పనిచేస్తున్న డాక్టర్ దంపతులనే అవమానకరంగా గెంటేయ చూసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు వారికి వత్తాసుగా నిలిచిన లాయర్లు, మీడియా కారణంగా వెనుకడుగు వేయడమే కాకుండా మరో మూడు నెలలపాటు వారి దేశంలోనే ఉండేందుకు అవకాశమిచ్చారు.
అమెరికాలో గత 15 ఏళ్లుగా న్యూరాలజిస్టులుగా పనిచేస్తున్న డాక్టర్ దంపతులనే అవమానకరంగా గెంటేయ చూసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు వారికి వత్తాసుగా నిలిచిన లాయర్లు, మీడియా కారణంగా వెనుకడుగు వేయడమే కాకుండా మరో మూడు నెలలపాటు వారి దేశంలోనే ఉండేందుకు అవకాశమిచ్చారు. వీసా గడువు ముగిసిన కారణంగా అనివార్యంగా దేశం వదిలిపెట్టి వెళ్ల వలసిన ఈ డాక్టర్ దంపతులను మానవతా కారణాలతో తాత్కాలికంగా అమెరికలోనే ఉండిపోయందుకు అవకాశం అనుకోని భాగ్యంలా ముందుకొచ్చింది.
అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న దేశంలో ఇలాంటి పరిణామాలు కూడా జరుగుతుండటం ఆశ్చర్యమే. పంకజ్ సాతిజా, మోనికా ఉమ్మత్‌లు భార్యాభర్తలు, వైద్యులు, గత పదిహేనేళ్లుగా అమెరికాలోని హ్యూస్టన్ ప్రాంతంలో న్యూరాలజిస్టులుగా పనిచేస్తున్న వీరికి ఇటీవలి వరకు ఏ సమస్యా లేద.కానీ గతేడాది అక్టోబర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న పంకజ్ తండ్రిని చూడటానికి ఆ దంపతులిరువురూ భారత్ వచ్చినప్పుడు అసలు సమస్య ఎదురైంది.
ఆ దంపతులు తిరిగి అమెరికా చేరుకున్న సమయంలో బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని అడ్డుకున్న కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు వారి వీసా ఈ ఏడాది జూన్‌తో ముగియనున్నట్లు స్టాంపు వేశారు. అయితే వారి ప్రయాణ పత్రాలకు 2016 జూన్‌లోనే గడువు తీరిందని అమెరికా సిటిజెన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ పేర్కొంది. ఈ రెండింటి మధ్య తారతమ్యాలను సరిదిద్దుకోవడానికి వాళ్లను తాత్కాలికంగా అప్పట్లో దేశంలోకి అనుమతించారు.
అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త చట్టాల ప్రకారం కాఠిన్యం ప్రదర్శిస్తున్న ఇమ్మిగ్రేషన్ అదికారులు పంకజ్ దంపతులిద్దరూ తమ ఇద్దరు పిల్లలతో కలిసి 24 గంటల్లో అమెరికా విడిచివెళ్లాలని బుధవారం హఠాత్తుగా చెప్పారు. దీంతో వారు తమ లాయర్లు, మీడియాతో కలిసి తమ ప్రాంత చట్ట సభ్యుల్ని కలుసుకోవడంతో తాత్కాలికంగా ఊరట లభించింది. వారిప్పుడు వెనుదిరిగితే రోగులకు నష్టం కలుగుతుంది కాబట్టి తమ విధులు పూర్తిచేయడానికి మరో మూడు నెలలు అక్కడ ఉండేందుకు అవకాశమిచ్చారు.
చట్టసభలు అనుమతిస్తే ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా అమెరికాలో చేతులు ముడుచుకోవాల్సిందే అనే కొత్త సత్యం ఈ డాక్టర్ దంపతుల ఉదంతంతో తెలియడం ముదావహం. మరి కొన్ని గంటల్లో అమెరికా విడిచి రావాల్సిన వాళ్లు ఆఖరి క్షణంలో అదృష్టం కలిసివచ్చి అక్కడే ఉండిపోవడం విశేషమే మరి.