ఐక్యరాజ్య సమితిలోని కీలక విభాగంలో భారత్‌కు చోటు దక్కింది. దీన్ని డ్రాగన్ కంట్రీ జీర్ణించుకోలేకపోతోంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఐక్యరాజ్య సమితిలోని ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఈసీఓఎస్ఓసీ)కి చెందిన 'యూఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్'లో భారత్‌కు సభ్యత్వం లభించింది.
ఇందుకోసం జరిగిన ఎన్నికల్లో భారత్‌తోపాటు చైనా, ఆఫ్ఘనిస్థాన్ కూడా బరిలో నిలిచాయి. చైనాను ఓడించిన భారత్‌కు సభ్యత్వం లభించింది. ఈ సందర్భంగా ఐరాసలోని భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి మాట్లాడుతూ.. లింగ సమానత్వం, మహిళా సాధిరకాత కోసం భారత్ చేస్తున్న కృషికి ఈ విజయం గుర్తింపు వంటిదన్నారు. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన సభ్యదేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ గెలుపుతో యూఎన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్‌లో భారత్ సభ్యత్వం ఐదేళ్లపాటు అంటే 2025 వరకు ఉంటుంది. ఇక, సభ్యత్వం కోసం పోటీపడిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాలెట్ ఓట్లు సాధించి గౌరవాన్ని నిలబెట్టుకోగా, చైనా మాత్రం దారుణంగా ఓటమి పాలైంది. బ్యాలెట్‌కు కావాల్సిన ఓట్లలో సగం కూడా సంపాదించుకోలేకపోవడం గమనార్హం.