భారత్ ప్రధాని పగ్గాలను మళ్లీ నరేంద్ర మోడీనే చేపట్టాలని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇండియాలో లోక్‌సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఇలా అనడంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మాజీ క్రికెటర్ కోరిక వెనుక కారణాలు కూడా ఉన్నాయి.
మోడీ ప్రధాన మంత్రి అయితే కాశ్మీర్ సమస్య ఓ కొలిక్కి వస్తుందని, కాంగ్రెస్ పాలనలోకి వస్తే వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుందని, వారు నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడుతారని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైట్ వింగ్‌కు భయపడుతుందని అభిప్రాయపడ్డారు.
భాజపా ప్రతిపక్షంలో ఉంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కాశ్మీర్ వంటి కీలకమైన అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోలేదని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. మోడీ అయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలరని ఆశాభావం వ్యక్తంచేశారు.
భారత్‌లో ముస్లింలు గతం నుంచి సురక్షితంగానే ఫీలయ్యే వారని అయితే హిందూ అతివాదం వల్ల ఇండియాలోని ముస్లింలలో కొంత భయం నెలకొని ఉందని మాత్రం ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో మోడీకి ఇమ్రాన్ మంచి కితాబు ఇచ్చినట్లయింది.