సాధారణంగా ఇంట్లో ఓ చిన్న బల్లి కనపడితేనే అసహ్యించుకుంటాం. అంతేకాదు కొందరికి బల్లి అంటే అలర్జీ కూడా. ఇక అలాంటి బల్లి మీద పడితే అంతే సంగతులు... ప్రాణాభయం... ఆ భయం... ఈ భయం... అరిష్టం అంటూ వెంటనే తలస్నానం చేసి, దీపం పెడుతుంటారు. అలాంటిది ఓ గాడ్జిల్లా సైజులో ఉండే బల్లి ఇంటికి వచ్చి తలుపులు కొడితే గుండె ఆగిపోదు సుమా... సరిగ్గా అలాంటి ఘటనే థాయిలాండ్‌లో చోటుచేసుకుంది.
ఓ భారీ మొసలికన్నా పెద్ద ఆకారంలో ఉన్న ఓ బల్లి ఇంటికి పిలవని అతిథిలాగా వచ్చింది. మెల్లగా పాకుతూ ఇంటిలోపలికి వెళ్లింది. అంతటితో ఆగిపోకుండా ఇంట్లో ఉన్న వస్తువులను తోస్తూ ముందుకు సాగింది. తోకతో గది తలుపులను కొడుతూ నానా హంగమా సృష్టించింది. అయితే ఇంటి యజమాని భయపడకుండా అది తిరుగుతున్నప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దాదాపు 15 అడుగుల పొడవుతో ఉన్న ఈ బల్లి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు వచ్చి దానిని బంధించి అడవిలో వదలిపెట్టారు. దీనిపై యజమాని మాట్లాడుతూ అప్పుడప్పుడు ఈ బల్లి మా ప్రాంతంలో తిరుగుతూ ఉండేదని చెప్పాడు. అంతేకాదు ఈ గాడ్జిల్లాకు సాలెనా అని ఒక ముద్దు పేరు కూడా ఉందండోయ్. అడవిలోకి వదిలిరావడం మళ్లీ తిరిగి ఇళ్లలోకి తిరిగిరావడం గాడ్జిల్లాకు అలవాటేనని యజమాని తెలిపారు.