ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు, పాఠశాలల్లో చదవాలని చాలా మంది విద్యార్థుల కల. అది నేరవేర్చుకునేందుకు కష్టపడి చదివి, ప్రవేశ పరీక్షలలో సీట్లు సాధిస్తారు. కానీ అలాంటి వారికి అన్యాయం జరిగింది. భారీ స్థాయిలో ముడుపులు చెల్లించి అక్రమంగా సీట్లు సంపాదించారు. హాలీవుడ్ స్టార్‌లు తమ పిల్లలను యేల్, స్టాన్‌ఫర్డ్, జార్జ్‌టౌన్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వంటి విశ్వవిద్యాలయాలలో చదివించాలని దొంగదారిని ఎంచుకున్నారు.
కోట్లకు కోట్లు లంచాలిచ్చారు. అమెరికా ప్రభుత్వం ఓ బోగస్ యూనివర్సిటీని సృష్టించి అక్రమంగా అక్కడ నివసిస్తున్న విద్యార్థులను వలపన్ని పట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భారీ కుంభకోణం బయటపడింది. ఈ స్కాంలో ‘డిస్పరేట్ హౌజ్‌వైఫ్’ నటి ఫిలిసిటీ హఫ్‌మన్, లోరి లాగ్లిన్, సహా 50 మందిపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు.
నిందితుల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, ఫైనాన్షియర్లు, ఓ వైన్ తయారీదారు, ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు. కాలిఫోర్నియాకు చెందిన విలియం సింగర్ అనే వ్యక్తి ఓ బోగస్ ఛారిటీ సంస్థను స్థాపించి వీరందరి నుండి లంచాలు పుచ్చుకుని సీట్లు ఇప్పించినట్లు తెలుస్తోంది. దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లపైనే వారు కన్నేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దివ్యాంగుల సీట్లకు సంబంధించిన నిబంధనలను కూడా వారు ఉల్లంఘించారని పోలీసులు పేర్కొన్నారు.