దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఓ దుండగుడు ఒక ఉపాధ్యాయుడిపై కత్తితో దాడి చేసి అతడి తల నరికాడు. తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడు. ఈ కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేశారు. రాజధాని పారిస్ శివార్లలోని కాన్‌ఫ్లాన్స్ సౌ హోనోరీ స్కూల్ దగ్గర ఈ దారుణం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం దుండగుడి వయసు 18 ఏళ్లని తెలుస్తోంది. బాధిత ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏడాది క్రితం ఫ్రెంచ్ పత్రిక చార్లీ హెబ్డోలో ప్రచురించిన మహమ్మద్ ప్రవక్త కార్టూన్ చూపించినట్లు తెలుస్తోంది. యాంటీ టెర్రరిస్ట్ టీమ్ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది.
అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఉపాధ్యాయుడు ఇస్లామిక్ తీవ్రవాద దాడికి గురయ్యారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ చెప్పారు. ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్దతిచ్చేవారని చెప్పారు. ఇది 'ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్' అన్నారు.
హింసకు వ్యతిరేకంగా దేశ పౌరులందరూ ఒక్కటవ్వాలని మేక్రాన్ విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదం ఎప్పటికీ గెలవలేదన్నారు. అటు ఫ్రాన్స్ విద్యా మంత్రి తన ట్వీట్‌లో ఒక ఉపాధ్యాయుడిని చంపడం అంటే అది నేరుగా ఫ్రాన్స్ మీద దాడి జరపడమేనని ట్వీట్ చేశారు.