ఫ్రాన్స్ దేశంలో కన్నబిడ్డ పట్ల తల్లిదండ్రులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. వేరే దేశానికి చెందిన అబ్బాయిని ప్రేమించిందన్న అక్కసుతో తల్లిదండ్రులే ఆ యువతి శిరోమండనం చేసి, అవమానించారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోస్నియాకు చెందిన ఓ కుటుంబం రెండేళ్లుగా ఫ్రాన్స్‌లోని బెసాన్‌కాన్‌లో ఉంటోంది. ఆ కుటుంబంలో 17 యేళ్ల అమ్మాయి కూడా ఉంది. ఈ అమ్మాయి, తాము నివసిస్తున్న భవనంలోని వేరే ఇంట్లో ఉంటోన్న సెర్బియాకు చెందిన 20 ఏళ్ల యువకుడిని ప్రేమించసాగింది.
పైగా, వీరిద్దరి మతాలు వేరు. అయినప్పటికీ వారిద్దరి మనసులు కలిశాయి. అయితే, వారి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో ఆమెను వారు శారీరకంగా హింసించసాగారు. అంతటితో ఆగని వారు ఏకంగా బోడిగుండు చేయించారు.
చివరకు ఆ యువతి మానసికంగా డిస్ట్రబ్ కావడంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. దీంతో మేల్కొన్న అక్కడి ప్రభుత్వం అమ్మాయి కుటుంబ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. బెసాన్‌కాన్ నగరం నుంచి బోస్నియా రాజధాని సరజెవోకు పంపింది. ఆ అమ్మాయి బాధ్యతలను ప్రస్తుతం సామాజిక సేవా సంస్థ చూసుకుంటోంది. ఆమె మేజర్ అయిన తర్వాత ఫ్రాన్స్‌లోనే నివసించే హక్కును పొందుతుంది.