స్వేచ్ఛ, కష్టపడి పని చేయడం, కుటుంబ విలువలపై సంబురాలు జరుపుకుందాం : డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అంటేనే వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. హిందువులపై డోనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ నాగరికతకు, అమెరికా సంస్కృతికి
అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అంటేనే వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. హిందువులపై డోనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ నాగరికతకు, అమెరికా సంస్కృతికి హిందూ వ్యవస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందని ట్రంప్ అన్నారు. కానీ సమాజంపై తనకు విస్తృత అవగాహన ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని పలువురు అంటున్నారు.
ప్రపంచవ్యాప్త ఇస్లామిక్ ఉగ్రవాద బాధితుల ప్రయోజనార్థం అక్టోబర్ 15వ తేదీన న్యూజెర్సీలోని పీఎన్సీ సెంటర్లో ఇండియన్ అమెరికన్ల సదస్సు జరుగనుంది. ఈ సమావేశానికి ట్రంప్ హాజరై ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో సదస్సుకు ఇండియన్లను ఆహ్వానిస్తూ ట్రంప్ వీడియో సందేశం పంపుతూ హిందూ సమాజంపై ప్రశంసలు గుప్పించారు. హిందువులు ప్రపంచ నాగరికతకు, అమెరికా సంస్కృతి వర్ధిల్లడానికి అద్భుతమైన కృషి చేశారని డొనాల్డ్ ట్రంప్ పొగడ్తల వర్షాన్ని కురిపించారు.
స్వేచ్ఛ, కష్టపడి పని చేయడం, కుటుంబ విలువలు, బలమైన విదేశాంగ విధానాల్లో సాధించిన విజయాలపై సంబురాలు జరుపుకొందాం రండి అంటూ ఆ సందేశంలో ఆయన ఇండియన్ అమెరికన్లను ఆహ్వానించారు. ఆ సభకు బాలీవుడ్ గాయకులు, డాన్సర్లతో పాటు హిందూమత ఆధ్యాత్మిక గురువుల హాజరుకానున్నారు. ఇలినోయిస్‌కు చెందిన ఇండియన్ అమెరికన్ షల్లీ కుమార్ నెలకొల్పిన రిపబ్లికన్ హిందూ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.