అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అమెరికా రిపబ్లికన్ నిక్లీ హేలీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దని తమ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు హెచ్చరించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాన్ని భారత్ సీరియస్‌గా తీసుకోవాలని అమెరికా రిపబ్లికన్ నిక్కీ హేలీ సూచించారు. అలాగే, భారత్‌ను కూడా తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు. భారత్‌కు మంచి మిత్రురాలిగా ఆమెకు పేరున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం న్యూఢిల్లీ - వాషింగ్టన్‌ల మధ్య నెలకొన్న తాజా విభేదాలను ఉద్దేశించి ఆమె ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'రష్యా నుంచి చమురు విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ సీరియస్‌గా తీసుకోవాలి. దాని పరిష్కారం కోసం వీలైనంత త్వరగా శ్వేతసౌధంతో కలిసి పనిచేయాలి. దశాబ్దాలుగా రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న స్నేహం, విశ్వాసమే.. ప్రస్తుత ఒడుదొడుకులను దాటేందుకు బలమైన పునాదిగా ఉపయోగపడుతుంది.
వాణిజ్యంలో, రష్యా చమురుపై అభిప్రాయభేదాలు వంటివి పరిష్కరించుకోవడానికి బలమైన చర్చలు, సంప్రదింపులు అవసరం. చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు న్యూఢిల్లీలో మిత్రులు ఉండాలి అన్న అంశం చాలా ముఖ్యమైంది. దానిని ఏమాత్రం విస్మరించడకూడదు' అని ఆమె పోస్టు చేశారు.
ఆంక్షలు విధించి భారత్‌ను అమెరికా దూరం చేసుకోవడంపై నిక్కీ హేలీ గతంలో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనాను ఎదుర్కోవాలన్న వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ట్రంప్ నిర్ణయాలు విపత్కరంగా మారాయని ఇటీవల ఆమె పేర్కొన్నారు.
ఇటీవల ఓ పత్రికకు రాసిన కాలమ్‌లో ఆమె స్పందిస్తూ 'ప్రపంచంలో ఆరోవంతు జనాభాకు కేంద్రం భారత్. అత్యంత యువ జనాభాతో చైనాను దాటేసింది. మరోవైపు డ్రాగన్ జనాభాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్' అని పేర్కొన్నారు.