సాధారణంగా దలైలామా అస్తమించిన తర్వాత కూడా తిరిగి అవతారమెత్తుతారన్నది టిబెట్‌లోని బౌద్ధుల నమ్మకం. ప్రస్తుతం ఉన్న దలైలామా రెండేళ్ల బాలునిగా ఉన్నప్పుడు అంతకుముందు వరకు ఉన్న 13వ దలైలామా ఆత్మ ఆయనలో ప్రవేశించిందని టిబెట్ బౌద్ధులు విశ్వసిస్తారు. అలాగే, తన తదనంతరం రానున్న 15వ దలైలామా భారతదేశంలోనే పుట్టనున్నారని ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా ఓ వార్తా సంస్థతో చెప్పుకొచ్చారు.
కాగా, తదుపరి దలైలామా భారత్‌లోనే పుడతారంటున్న ప్రస్తుత దలైలామా వ్యాఖ్యలను చైనా తప్పుబడుతోంది. భారత సంతతికి చెందిన వారిని కాకుండా వేరే వారిని దలైలామాగా నియమించాలని చైనా భావిస్తోంది.
దలైలామాకు వారసునిగా వచ్చే వ్యక్తికి చైనా ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు. చక్రవర్తుల కాలం నుంచి ఇది సంప్రదాయంగా వస్తోందని ఆయన గుర్తుచేశారు. 14వ దలైలామా నియామకం సమయంలో కూడా చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గెంగ్ షువాంగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మొత్తం మీద ఈ లెక్కన చూస్తే... దలైలామాలకు కూడా తమ ముద్ర పడవలసిందేననేది చైనా వాదన... మరి ఇది ఏ విధమైన చర్చకు దారి తీస్తుందో.