కరోనా వైరస్ గుప్పెట్లో చిక్కుకుని ప్రపంచం అల్లకల్లోలమైపోతోంది. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు చేయని ప్రయత్నమంటూ లేదు. చివరకు కరోనాకు విరుగుడు కనిపెట్టే పనిలో అనేక ప్రపంచ దేశాలు నిమగ్నమైవున్నాయి. ఈ క్రమంలో టీకా అభివృద్ధి, దాని పంపిణీ విషయంలో పరస్పరం సహకరించుకునేందుకు డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో 150 దేశాలు కొవాక్స్ పేరిట ఓ కూటమిగా అవతరించాయి.
ఈ కూటమి దేశాలు వివిధ దశల్లో ఉన్న కరోనా టీకాను అందిపుచ్చుకుని పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఫలితంగా ఏ టీకా అయితే కరోనాపై సమర్థంగా పనిచేస్తుందో దాని నుంచి వీలైనంత త్వరగా లబ్ధిపొందాలన్నది వాటి ఆలోచనగా వుంది. ఈ ఒప్పందం వల్ల అందరికీ ప్రయోజనం లభిస్తుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే, ట్రంప్ ప్రభుత్వం మాత్రం వీటితో కలవకుండా ఒంటరిగానే వెళ్లాలని నిర్ణయించింది.
ఈ కూటమిలో చేరేందుకు అగ్రరాజ్యం అమెరికా నిరాకరించింది. ప్రపంచం ఎటుపోతే మాకేంటి, మాదారి మాదే అని డోనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. పైగా కరోనా వైరస్ వ్యాప్తికి చైనాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కారణమంటూ మరోమారు ఆరోపణలు చేసింది.
అదేసమయంలో కరోనా వ్యాక్సిన్ విషయంలో తమది భిన్నమైన దారి అని స్పష్టం చేసింది. టీకా అభివృద్ధి, పంపిణీ విషయంలో తామెవరితోనూ కలిసి నడవబోమని, తమను తాము నిర్బంధించుకోదలచుకోలేదని తేల్చిచెప్పింది.
అయితే, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై స్వదేశంలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహమ్మారిని ఓడించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఇది గండికొట్టే ప్రమాదం ఉందని డెమోక్రటిక్ చట్టసభ్యుడు అమీ బెరా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో ఒంటెత్తు పోకడలు పనికిరావని, కోవాక్స్‌లో చేరడం ద్వారా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించే భరోసా ఏర్పడుతుందని అన్నారు. అంతేకాదు, ఈ నిర్ణయం వల్ల అమెరికా పౌరుల ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.