కొత్త కొవిడ్ స్ట్రెయిన్ కొత్త రకం లక్షణాలతో విజృంభిస్తోంది. బ్రెజిలియన్, కెంట్ కొవిడ్ వేరియెంట్లతో కలిగే ఇన్‌ఫెక్షన్ లక్షణాలు తీవ్రంగా, భిన్నంగా ఉంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో కనిపిస్తున్న లక్షణాలు, పూర్వపు కొవిడ్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలకు భిన్నంగా ఉంటున్నాయి.
గుజరాత్‌లోని కొవిడ్ బాధితుల్లో కడుపునొప్పి, తలతిరుగుడు, వాంతులు, జలుబు వంటివి కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని కొవిడ్ బాధితుల్లో కీళ్ల నొప్పులు, మయాల్జియా, జీర్ణసంబంధ సమస్యలు, ఆకలి కోల్పోవడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే వైద్యులు ఏ కొత్త లక్షణం కనిపించినా కొవిడ్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
పింక్ ఐస్: కనుగుడ్డులోని ఆక్యులర్ మ్యూకస్ మెంబ్రేన్ ద్వారా కొవిడ్ వైరస్ శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది. అప్పుడు కళ్లు ఎర్రబడి, నీరు కారే పింక్ ఐస్ లక్షణం కనిపిస్తుంది. కళ్లకలకను తలపించే ఈ లక్షణానికి కొవిడ్ పరీక్షతో కారణాన్ని నిర్థారించుకోవడం అవసరం.
వినికిడి లోపం: ఒకటి లేదా రెండు చెవుల్లో గంట మోగుతున్న శబ్దం వినిపించడం టిన్నిటస్ అనే చెవి సమస్య లక్షణం. కొందరు కొవిడ్ బాధితుల్లో ఇదే లక్షణం కనిపిస్తోంది.
జీర్ణసంబంధ సమస్యలు: డయేరియాలో కనిపించే వాంతులు, విరేచనాలు కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌లోనూ బయల్పడుతున్నాయి. ఊపిరితిత్తుల మీద దాడి చేసే కొవిడ్ వైరస్ మూత్రపిండాలు, కాలేయం, జీర్ణవ్యవస్థల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. విరేచనాలు లాంటి లక్షణాలను కూడా కొవిడ్ లక్షణాలుగానే అనుమానించాలి.
విపరీతమైన నీరసం: కొవిడ్ వైరస్ మూలంగా శరీరంలో జరిగే సైటోకైన్స్ రియాక్షన్‌తో విపరీతమైన బడలిక, నీరసం ఆవరిస్తాయి. తీవ్ర ఇన్‌ఫెక్షన్ సమయాల్లో ఈ సైటోకైన్స్ వెనువెంటనే ఇన్‌ఫెక్షన్‌తో పోరాటానికి దిగుతాయి. ఆ సమయంలో విపరీతమైన నిస్సత్తువ ఆవరిస్తుంది.