కోవిడ్-19తో భారతీయ సంతతకి చెందిన టీచర్ డాక్టర్ లూయిసా రాజకుమారి బ్రిటన్‌లో మృతి చెందారు. లండన్‌లోని కింగ్స్‌ఫర్డ్ కమ్యూనిటీ స్కూల్‌లో ఆమె ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. స్కూట్ వెబ్‌సైట్‌లో హెడ్ టీచర్ జోవాన్ డెస్‌లాండ్స్ .. భారతీయ టీచర్‌కు నివాళి అర్పించారు. డాక్టర్ రాజకుమారి చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కింగ్స్‌ఫర్డ్ స్కూల్ టీచర్ రాజకుమారిని అత్యంత అభిమానిస్తున్నదని, కానీ కరోనా వల్ల ఆమె ఈ ఉదయం మరణించినట్లు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. కొన్ని వారాల పాటు ఆమె వెంటిలేటర్ చికిత్స పొందారని, ఎన్ని ప్రయత్నాలు చేసినా డాక్టర్లు ఆమె ప్రాణాలను కాపాడలేకపోయినట్లు తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో పాఠాలు చెప్పే సత్తా ఉన్న ఇంగ్లీష్ టీచర్ రాజకుమారి అని స్కూల్ యాజమాన్యం ఆమెను కీర్తించింది. టీచర్ కుటుంబసభ్యులకు యాజమాన్యం సంఘీభావం తెలిపింది. రాజకుమారి మృతి పట్ల విద్యార్థులు కూడా కలత చెందారు.
కాగా.. బ్రిటన్‌లో కరోనా తీవ్రత పెరుగుతోంది. ఆర్ధిక వ్యవస్థ సతమతమవుతోంది. లక్షా 40 వేల కంపెనీలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఆంక్షలు సడలిస్తే రెండో విడత కరోనా విజృంభించే ప్రమాదముంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.