Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ దేశాల్లో ఆంక్షలు హుష్!

ఆ దేశాల్లో ఆంక్షలు హుష్!
, శనివారం, 9 మే 2020 (21:07 IST)
కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. దీంతో ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని చాలా రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్ ఎత్తేస్తున్నాయి. తాజాగా కొన్ని దేశాలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
 
ఆస్ట్రేలియా..
లాక్‌డౌన్ క్రమంగా ఎత్తేసేందుకు ఆస్ట్రేలియా సిద్ధం అవుతోందని ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ వెల్లడించారు. ఇందులో భాగంగా భౌతిక దూరం నిబంధనలను క్రమంగా మూడు దశల్లో సడలించనున్నట్లు తెలిపారు.

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటూ.. జూలై నాటికి రాజధాని కాన్‌బెర్రాలో చాలా వరకు ఆంక్షలను సడలిస్తామన్నారు. దాదాపు 10 లక్షల మంది తిరిగి ఉద్యోగాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కాగా.. కంగారూ దేశంలో ఇప్పటికి వరకు దాదాపు 16వేల కరోనా కేసులు నమోదవ్వగా.. 614 మంది మరణించారు.
 
స్వీడన్..
మహమ్మారిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటూనే.. వ్యాపార సముదాయాలను తెరిచేందుకు స్వీడన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కేఫ్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లు తదితరాలు తెరుచుకున్నాయి. స్వీడన్ ఇప్పటి వరకు 25వేల మంది మహమ్మారి బారినపడగా.. దాదాపు 3వేల మంది కన్నుమూశారు.
 
ఫ్రాన్స్..
కరోనా మహమ్మారి విజృంభించడంతో.. ఫ్రాన్స్ ప్రభుత్వం మార్చి రెండో వారంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. అయితే కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో.. ప్రస్తుతం కొవిడ్-19 బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం సోమవారం నుంచి లాక్‌డౌన్ నిబంధనలను సడలించనుంది. కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న మొదటి పది దేశాల్లో ఫాన్స్ 6వ స్థానంలో ఉంది. ఫ్రాన్స్‌లో 1.76లక్షల మందికి వైరస్ సోకగా.. 26వేల మంది చనిపోయారు. 
 
ఇటలీ..
కరోనా కాటుకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.76లక్షల మంది బలయ్యారు. ఇందులో దాదాపు 30వేలకుపైగా మరణాలు ఒక్క ఇటలీలోనే నమోదయ్యాయి. కరోనా బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య పరంగా ఇటలీ మూడోస్థానంలో ఉంది. అయినప్పటికీ లాక్‌డౌన్ నిబంధనలను ఇటలీ సడలించింది.

పరిమిత దూరంలో ప్రజలు బయట తిరగడానికి ఇటలీ ప్రభుత్వం అనుమతించింది. రెస్టారెంట్‌లు, సెలూన్‌లు జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటుంది. 
 
జర్మనీ..
లాక్‌డౌన్ సడలింపు ప్రక్రియను జర్మనీ.. గత వారమే ప్రారంభించింది. 800 చదరపు అడుగుల వైశాల్యం గల షాప్‌లను తెరిచేందుకు జర్మనీ ప్రభుత్వం అనుమతించింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ ఇతర లాక్‌డౌన్ నిబంధనలను కూడా ఎత్తేసేందుకు జర్మనీ చర్యలు తీసుకుంటోంది.

జర్మనీలో కరోనా కాటుకు ఇప్పటి వరకు దాదాపు 26వేల మంది బలవ్వగా.. 1.70లక్షల మందికి వైరస్ సోకింది. కాగా.. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 40లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 2.76లక్షల మంది మహమ్మారి కారణంగా కన్నుమూశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీ విటమిన్‌ ఉంటే ఢోకా లేదు!..