చైనాలో భార్యను హతమార్చి.. ఆమె మృతదేహాన్ని 106 రోజులు ఫ్రీజర్‌లో వుంచిన వ్యక్తిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అతనిని కోర్టు ముందు హాజరు పరిచారు.
దీనిపై విచారణ జరిపిన షాంఘై కోర్టు అతనికి మరణ శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. చైనా హాంగో ప్రాంతానికి చెందిన జూజియోంగ్ (30) ఓ టెక్స్‌టైల్ షాపులో పనిచేస్తూ వచ్చాడు. ఇతని భార్య యాంగ్ లిప్పింగ్ (30) ఆ ప్రాంతంలోని ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది.
వీరిద్దరి మధ్య పెళ్ళైన నాటి నుంచి విబేధాలు వుండేవి. ఈ నేపథ్యంలో గత 2016వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఇద్దరి మధ్య వాగులాట ఏర్పడింది. ఈ వాగ్వివాదం ముదరడంతో ఆవేశానికి గురైన జూజియోంగ్ భార్యను గొంతు నులిమి చంపేశాడు. భార్యను తాను హతమార్చిన విషయం బయటికి పొక్కనీయకుండా వుండేందుకు.. ఆమె మృతదేహాన్ని ఫ్రీజర్‌లో వుంచాడు.
చివరికి యాంగ్ లిప్పింగ్ కనిపించట్లేదని పొరుగింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసుల వద్ద భార్యను హతమార్చిన విషయాన్ని జూ జియోంగ్ అంగీకరించాడు. ఆపై 2018 ఆగస్టు నెలలో షాంఘై కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది.
అప్పట్లో అతనికి కోర్టు మరణ దండన విధించింది. కానీ జూజియోంగ్ అప్పీలు చేశాడు. కానీ షాంగై కోర్టు అతనికి ఇచ్చిన శిక్షను మార్పు చేయలేమని స్పష్టం చేయడంతో పాటు అతనికి మరణ శిక్షను ఖాయం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.