డ్రాగన్ కంట్రీ చైనా పాలకులు సరికొత్త ఆంక్షలు విధించారు. ముఖ్యంగా, పిల్లలు ఆన్‌లైన్‌లో ఆడే వీడియో గేమ్స్‌పై ఈ ఆంక్షలను అమలు చేయనున్నారు. 18 ఏళ్ల వయస్సులోపు వారు ఇకపై వారంలో మూడు గంటలు మాత్రమే ఆడుకొనేలా కొత్త విధివిధానాలు తీసుకొచ్చారు.
ఈ కొత్త ఆంక్షలు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకిరానుంది. సెప్టెంబర్ 1 నుంచి శుక్రవారాలు, వీకెండ్స్, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గేమ్స్ ఆడుకొనేలా అవకాశం కల్పిస్తున్నట్టు నేషనల్ ప్రెస్ అండ్ పబ్లికేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్పీపీఏ) సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
2019లో జారీ చేసిన నిబంధనల ప్రకారం రోజుకు గంటన్నర, ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు గంటల చొప్పున ఆడుకొనే వెసులుబాటు మైనర్లకు ఉండగా.. ఆ సమయాన్ని మరింతగా కుదిస్తూ వారంలో కేవలం మూడు గంటలకే పరిమితం చేస్తూ చైనా ఆంక్షలు విధించడం గమనార్హం.
ఈ కొత్త నిబంధనలతో చైనాలోని గేమింగ్ దిగ్గజం టెన్సెంట్‌తో పాటు అలీబాబా తదితర అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది. అలాగే, గేమింగ్ కంపెనీలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు నిబంధనల అమలును పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.