ప్రపంచ యాత్రికుడు క్రిష్టోఫర్ కొలంబస్ 500 ఏళ్ల కిందట చెప్పిన విషయం నిజమేనని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. కరేబియన్ దీవుల్లో దక్షిణ అమెరికాకు చెందిన కరీబీ నరమాంస భక్షకులు తనకు తారపడినట్లు ఆయన చెప్పిన కథనాన్ని ధ్రువీకరించారు.
తొలినాటి కరేబియన్ వాసుల పుర్రెలను ‘ఫేషియల్ రికగ్నిషన్’ సాంకేతికతతో పరిశీలించి ఈ మేరకు నిర్ధరించారు.
1492లో తాను కరేబియన్ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు దక్షిణ అమెరికాకు చెందిన కరీబ్ ఆక్రమణదారులు కనిపించినట్లు కొలంబస్ పేర్కొన్నారు.
వీరు జమైకా, హిస్పానియోలా, బహమాస్ దీవులపై దాడి చేసి, అక్కడ శాంతియుతంగా నివసించే అరావాక్ తెగ మహిళలను నిర్బంధించి, పురుషులను చంపి తినేవారని చెప్పారు. వీరిని తొలుత ఆయన ‘కనిబా’ జాతిగా పొరబడ్డారు. ఆ తర్వాత వచ్చిన స్పానిష్ యాత్రికులు దాన్ని ‘కరీబీ’గా సరిచేశారు.
అయితే చాలాకాలంగా కొలంబస్ వాదనతో పురావస్తు శాస్త్రవేత్తలు విభేదిస్తూ వచ్చారు. వెయ్యి మైళ్లు ప్రయాణం చేసి కరీబీలు అక్కడికి ఎలా వెళ్లి ఉంటారన్నది వారి సంశయం. కొలంబస్ తర్వాత వందేళ్లకు కాని కరీబీలు ఆ దీవులకు వెళ్లి ఉండరని అంచనావేశారు.
అయితే కరేబియన్ ప్రాంతంలో కనిపించిన వంద పురాతన పుర్రెలను తాజాగా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. కొలంబస్ యాత్ర సమయంలో కరీబీలు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. వీరు క్రీస్తు శకం 800 సంవత్సరంలోనే అక్కడికి వెళ్లినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు