సముద్రంలో పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 53 మంది జల సమాధి అయ్యారు. ఈ దారుణం లిబియా సముద్రంలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 55 మంది వలసదారులతో కూడిన రబ్బరు బోటు ఫిబ్రవరి 5న రాత్రి 11 గంటలకు లిబియాలోని జావియా నగరం నుంచి బైలుదేరింది. ఐతే ఆ పడవ సముద్రంలో ఆరు గంటలు ప్రయాణించిన తర్వాత సముద్రపు భారీ అలల ఉధృతికి అతలాకుతలమైంది.
నావికులు పడవను అదుపు చేసేందుకు చేసిన అన్ని యత్నాలు విఫలమయ్యాయి. దీనితో పడవ అలల హోరులో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 53 మంది జల సమాధి అయ్యారు. కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ప్రాణాలతో బైటపడ్డారు. తమ కళ్ల ముందే రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేస్తూ అంతా నీటిలో మునిగిపోయారంటూ వారిద్దరూ కన్నీటిపర్యంతమయ్యారు. కాగా లిబియా నుంచి యూరప్ కు వెళ్లేందుకు ఇలా పడవల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించి చాలామంది ఇలాగే మృత్యువాత పడుతున్నారు.