Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కీలక నిర్ణయం తీసుకున్న ఆస్ట్రేలియా సర్కారు... గోల్డెన్ వీసాలు రద్దు

golden visa

వరుణ్

, బుధవారం, 24 జనవరి 2024 (11:20 IST)
ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం జారీ చేసే గోల్డెన్ వీసాలను రద్దు చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే లక్ష్యంతో ఈ తరహా వీసాలను జారీ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలన్న ఉద్దేశ్యంతో వీటిని ప్రవేశపెట్టారు. అయితే, ఈ తరహా వీసాల ద్వారా ఆశించిన ప్రయోజనం రాకపోవడంతో గోల్డెన్ వీసాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో వృత్తి నిపుణుల వీసాల జారీకి ఆస్ట్రేలియా యోచన చేస్తుంది. 
 
ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన అంశాల్లో గోల్డెన్ వీసా ఒకటి. గత 2012లో వీటిని ప్రవేశపెట్టింది. దేశంలోకి పెట్టుబడులు వెల్లువెత్తేలా చేసేందుకు వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. విదేశీ సంపన్న పెట్టుబడిదారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆస్ట్రేలియా వచ్చి పెట్టుబడులు పెట్టేలా చేయడమే ఈ గోల్డెన్ వీసాల ఉద్దేశం.
 
ఈ వీసాతో విదేశీ పెట్టుబడిదారులు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాస హక్కు పొందుతారు. కనీసం ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడితే ఐదేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. ఈ వీసా పొందగోరే వాళ్లకు ఇంగ్లీషులో మాట్లాడాలన్న నిబంధన కానీ, వయో పరిమితి కానీ ఉండవు. ఆస్ట్రేలియాలో పెట్టుబడులు పెట్టడమే ముఖ్యం.
 
ఈ గోల్డెన్ వీసా విధానాన్ని సద్వినియోగపర్చుకుంది చైనా సంపన్నులేనని చెప్పాలి. ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన గోల్డెన్ వీసాలు పొందినవారిలో 85 శాతం చైనా వ్యాపారవేత్తలే ఉన్నారు. అయితే, ఈ వీసాలతో ఆస్ట్రేలియాకు లబ్ది చేకూరకపోగా, ఆస్ట్రేలియాలో ఉన్న సంపదను విదేశాలకు తరలిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో గోల్డెన్ వీసాల నుంచి ఆశించిన ప్రయోజనం రావడంలేదని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం, వాటిని రద్దు చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చింది. గోల్డెన్ వీసాల బదులు దేశంలో ఉత్పాదకతను పెంచడం కోసం వృత్తి నిపుణులకు పెద్ద ఎత్తున వీసాలు ఇవ్వాలని సంకల్పించింది.
 
దీనిపై ఆస్ట్రేలియా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి క్లేర్ ఓనీల్ స్పందించారు. ఎన్నో ఏళ్లుగా అమల్లో ఉన్నప్పటికీ గోల్డెన్ వీసాలతో ఎలాంటి ప్రయోజనం సమకూరడంలేదని, ఆస్ట్రేలియా ఏం ఆశించి ఈ వీసాలను తీసుకువచ్చిందో, ఆ ఉద్దేశం నెరవేరడంలేదని, అందుకే వీటిని రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏప్రిల్ 16వ తేదీన లోక్‌సభ ఎన్నికలు : ఎన్నికల సంఘం క్లారిటీ