ఒకవైపు కరోనాతో ప్రపంచ దేశాలు నానా తంటాలు పడుతుంటే.. మరోవైపు రోడ్డు ప్రమాదాలు, ప్రకృతీ వైపరీత్యాలు జనాల ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని షితాలక్య నదిలో బోటు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27మంది దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. వంద మందికి పైగా ప్రయాణికులను తీసుకెళుతున్న బోటు కార్గో నౌకను ఢీ కొన్న తర్వాత నదిలో తిరిగబడడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఢాకాకు 16 కిలోమీటర్ల దూరంలోని నారాయణ్‌గంజ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆదివారమే ఐదు మృతదేహాలను వెలికి తీశారు. సోమవారం మరో 22మంది మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య 27కి పెరిగింది.
భారీ క్రేన్ సాయంతో బోటును కూడా నదిలో నుండి వెలికి తీశారని అధికారులు తెలిపారు. ఢీ కొట్టిన తర్వాత కార్గో నౌక ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయిందని పోలీసులను ఉటంకిస్తూ ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తుకు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నేతృత్వాన ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు.