సాధారణంగా బిడ్డ ఆకలి తల్లికి మాత్రమే తెలుస్తుంది. తమ బిడ్డ ఏడిస్తే ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. ఊరుకోపెట్టడానికి అమ్మ బిడ్డ నోటికి స్థన్యాన్ని అందిస్తుంది. అమ్మ ఆత్మీయ స్పర్శ, అందించే పాలు బిడ్డని హాయిగా నిద్రపుచ్చుతుంది.
అంతేనా, బిడ్డతల్లి తన విధుల్లో ఉన్నా... ఇంట్లో ఉన్న చిన్నారి గురించే ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆకలికి ఏడుస్తుందో ఏమో అని ఆరాట పడుతుంటుంది. ఫిలిఫ్పైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వర్తిస్తున్న 24 యేళ్ళ ప్రతీశా ఓరాంగో కూడా ఈ మధ్యే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తన ప్రశూతి సెలవులు ముగియడంతో తిరిగి విధుల్లో చేరింది.
ఈ క్రమంలో విమానంలో విధులు నిర్వహిస్తుండగా, ఆ ఫ్లైట్ గగనతలంలో వెళుతోంది. ఆ సమయంలో నెలల చిన్నారి ఒకరు గుక్కపట్టి ఏడుస్తున్న విషయాన్ని గమనించింది. ఆరా తీస్తే బిడ్డకు తను పట్టిన పాలు సరిపోక ఏడుస్తుందేమో అని తల్లి ఎయిర్ హోస్టెస్‌కు వివరించింది. దాంతో ప్రతీశ మీకు అభ్యంతరం లేకపోతే తాను బిడ్డకు పాలిస్తానని చెప్పింది.
అంతే.. ఆ బిడ్డ తల్లి సంతోషంగా అంగీకరించింది. ఆ వెంటనే ఏడుస్తున్న బిడ్డని తన చేతుల్లోకి తీసుకుని తన స్థన్యం అందించి పాలిచ్చింది. దీంతో కడుపునిండిన ఆ పాపాయి అమ్మ ఒడిలో వెచ్చగా పడుకుంది. ప్రతీశా చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్స్ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.