దక్షిణ చైనాలో ఏకంగా 30 మంది విద్యార్థులకు ప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధి సోకడంతో వారు చదువుతున్న పాఠశాలను మూసివేశారు. ఈ విద్యార్థులను ఏ (హెచ్1ఎన్1) ఫ్లూ వైరస్ సోకిన కారణంగా జబ్బున పడినట్లు అధికారిక యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది. ఆసియా- ఫసిఫిక్ ప్రాంతంలో స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.
చైనా అధికారిక వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. గువాన్డోంగ్ ప్రావీన్స్లోని డోంగ్వాన్ నగరంలో ఉన్న షైపై టౌన్షిప్ సెంట్రల్ ప్రైమరీ పాఠశాలలో గత బుధవారం ఆరుగురు విద్యార్థులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు అనుమానాలు వచ్చాయి. శుక్రవారం వారికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణకు వచ్చారు.
అయితే ఇదే వారంలో మరో 24 మంది విద్యార్థులు ఈ వైరస్ కారణంగా జబ్బున పడ్డారని, వారికి ఆదివారం స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయినట్లు చైనా అధికారిక యంత్రాంగం తెలిపింది. జబ్బునపడిన అందరు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. వారందరూ స్వల్ప అనారోగ్యంతోనే బాధపడుతున్నారు.
ముందుజాగ్రత్త చర్యగా వారు చదువుతున్న పాఠశాలను వారంపాటు మూసివేశారు. ఈ పాఠశాలలో మొత్తం 1314 మంది విద్యార్థులను చదువుతున్నారు. చైనాలో ఆదివారం 58 మంది పౌరులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 414కి చేరింది.