Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

25 తీవ్రవాద సంస్థలపై పాకిస్థాన్ నిషేధం

25 తీవ్రవాద సంస్థలపై పాకిస్థాన్ నిషేధం
పాకిస్థాన్‌లో 25 తీవ్రవాద సంస్థలపై నిషేధం విధించినట్లు ఆ దేశ ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. పాక్ ప్రభుత్వం నిషేధించిన సంస్థల్లో భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న జమాదుత్ దవా, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థలు కూడా ఉన్నాయని అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.

దేశంలో నిషేధించిన తీవ్రవాద సంస్థల జాబితాను అంతర్గత వ్యవహారాల శాఖ బుధవారం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి సమర్పించింది. ఇదిలా ఉంటే సున్నీ తెహ్రీక్ సంస్థను పరిశీలన జాబితాలో ఉంచినట్లు తెలిపింది.

తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న జమాదుత్ దవా, లష్కరే తోయిబా, తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్, జైషే మొహమ్మద్, తెహ్రీక్ ఎ నిఫాజ్ ఎ షరియా ముహమ్మది, లష్కరే జాంగ్వి, అల్ అక్తర్ ట్రస్ట్, అల్ రషీద్ ట్రస్ట్, తెహ్రీక్ ఎ ఇస్లామీ, ఇస్లామిక్ స్టూడెంట్ మూమెంట్, ఖైర్ ఉన్ నిసా ఇంటర్నేషనల్ ట్రస్ట్, ఇస్లామీ తెహ్రీక్ ఎ పాకిస్థాన్, లష్కరే ఇస్లాం, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, జమియాత్ ఉన్ నిసార్, ఖడమ్ ఇస్లామ్, మిలాత్ ఎ ఇస్లామియా పాకిస్థాన్, తదితర సంస్థలపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.

ఈ జాబితాలోని ఎక్కువ సంస్థలకు పాకిస్థాన్‌లో తీవ్రవాద దాడులు, ఆత్మాహుతి దాడులతో సంబంధాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జమాదుత్ దవా, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థలు తమ దేశంలోనూ దాడులు చేస్తున్నాయని భారత్ చాలా కాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

పాకిస్థాన్ జమాదుత్ దవా తీవ్రవాద సంస్థను గత ఏడాది డిసెంబర్‌లో నిషేధించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆ సమయంలోనే ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి జమాదుత్ దవాను తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌లపై పాకిస్థాన్‌లో 2002 నుంచి నిషేధం కొనసాగుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం జాతీయ అసెంబ్లీకి వివరణ ఇస్తూ.. దేశంలో మొత్తం 25 మత, ఇతర సంస్థలపై తీవ్రవాద నిరోధక చట్టం, 1997 కింద నిషేధం విధించామని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu