చైనాలో 2042 నాటికి దేశ మొత్తం జనాభాలో 30 శాతం మంది వయోవృద్ధులే ఉంటారని ఒక అధికారిక నివేదిక తేల్చింది. దేశంలో జనన రేటు తక్కువ ఉండగా వృద్ధుల జనాభా వేగంగా పెరిగిపోతున్నదని చైనా నేషనల్ వర్కింగ్ కమీషన్ ఆన్ ఏజింగ్ తయారు చేసిన ఇటీవలి నివేదికలో వెల్లడించింది.
వచ్చే ఐదు సంవత్సరాల్లో చైనా వృద్ధుల జనాభా శాతం 16.7 శాతానికి చేరుతుందని అంచనావేసిన వర్కింగ్ కమీషన్ 2042 నాటికి 30 శాతం ఉంటుందని చెప్పింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక దేశం లేదా ప్రాంతం 60 లేదా అంతకంటే వయస్సు గల ప్రజల జనాభా మొత్తం జనాభాలో 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం ఉంటే ఆ దేశం లేదా ప్రాంతాన్ని వయస్సు మీదపడిన సమాజంగా పరిగణిస్తారు.
ప్రస్తుతం చైనాలో 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 178 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారు. ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 13 శాతం. గత ఏడాది జనాభా లెక్కల ప్రకారం చైనా జనాభా 1.3397 బిలియన్లకు చేరింది.