అమెరికా ఆయుధాగారంలోకి వచ్చే ఏడాది సూపర్ బాంబు వచ్చి చేరనుంది. ప్రపంచంలో ఇప్పటివరకు తయారైన అత్యంత శక్తివంతమైన బాంబుల్లో ఇది కూడా ఒకటి. మిగిలిన బాంబులన్నింటి కంటే శక్తివంతమైనదిగా పేరొందిన ఈ సూపర్ బాంబు వచ్చే ఏడాది తమ అమ్ములపొదిలో చేరుతుందని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం వెల్లడించింది.
పెంటగాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సూపర్ బాంబు 14 టన్నుల బరువు కలిగివుంటుంది. దీనిని తయారు చేసేందుకు 88 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు పెంటగాన్ వెల్లడించింది. మాసివ్ ఆర్టిలరీ అనే పేరుతో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా అమెరికా రక్షణ శాఖ ఈ సూపర్ బాంబును తయారు చేస్తోంది.
6 మీటర్ల పొడవుతో తయరయ్యే సూపర్ బాంబు 60 మీటర్ల ప్రభావిత ప్రదేశంలోకి బాగా చొచ్చుకెళ్లిన తరువాత పేలుతుంది. ఈ బాంబు సృష్టించే పేలుడు తీవ్రతను ఇతర మార్గాల్లో సృష్టించాలంటే 2400 కిలోల పేలుడు పదార్థంతో క్షిపణిని ప్రయోగించాలి. గతంలో అమెరికా తయారు చేసిన బీఎల్యూ- 109 బాంబు కంటే ఇది రెండురెట్లు శక్తివంతమైంది.
ఇప్పటివరకు ప్రపంచంలో శక్తివంతమైన బాంబుగా గుర్తింపు పొందిన రష్యా వ్యాక్యుమ్ బాంబు కంటే ఇది ఎక్కువ విధ్వంసం సృష్టిస్తుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఈ సూపర్ బాంబును బి- 52 లేదా బి- 2 విమానాల నుంచి ప్రయోగించేందుకు వీలుగా రూపొందిస్తున్నారు. ఇరాన్ అనుమానాస్పద అణ్వాయుధ కార్యక్రమాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా ఈ బాంబు తయారీని చేపట్టినట్లు గతంలో ప్రచారం జరిగింది.