మలేషియాలో ఘోరం జరిగింది. ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న రెండు నౌకాదళ హెలీకాప్టర్లు ఢీ కొన్న ఘటనలో పది మంది దుర్మరణం పాలయ్యారు. మే నెలలో జరిగే నేవీ ఫ్లీట్ ఓపెన్ డే వేడుకల కోసం నేవీ చాపర్లు ఫ్లై పాస్ట్ రిహార్సల్స్ చేస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
నేవీ ఫ్లీట్ ఓపెన్ డే వేడుకల్లో భాగంగా నేవీ చాపర్లు ఫ్లై పాస్ట్ విన్యాసాలు చేస్తాయి. ఆ విన్యాసాలకు సంబంధించి మంగళవారం నేవీ హెలీకాప్టర్లు రిహార్సల్స్ చేస్తున్నాయి.
ఆ సమయంలో ఒక హెలికాప్టర్ మరో హెలికాప్టర్ వెనుక రోటర్‌ను క్లిప్పింగ్ చేయడంతో రెండూ టెయిల్ స్పిన్ లోకి వెళ్లి కూలిపోయాయి.
ఫెన్నెక్ AS555SN యూరోకాప్టర్, అగస్టా వెస్ట్ ల్యాండ్ ఏడబ్ల్యూ139 హెలికాప్టర్లు ఈ ప్రమాదానికి గురైనట్లు మలేసియా రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రమాదంలో చనిపోయిన నౌకాదళ సిబ్బంది కుటుంబాలకు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సంతాపం తెలిపారు.