సోమాలియా సముద్రతీర ప్రాంతం పైరేట్లకు స్వర్గధామంగా మారింది. వారి ఆగడాలు ఇక్కడ అడ్డూఆపూ లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. నౌకా వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సముద్రపు దొంగల (పైరేట్ల) ఆటకట్టించేందుకు అంతర్జాతీయ సమాజం చేపట్టిన చర్యలు కూడా అంతంతమాత్రంగానే పనిచేస్తున్నాయి.
తాజాగా సోమాలియా పైరేట్లు ఓ జర్మనీ నౌకను హైజాక్ చేసి 2.7 మిలియన్ డాలర్ల లంచం వసూలు చేశారు. ఐదుగురు జర్మన్లు, ముగ్గురు రష్యా పౌరులు, ఇద్దరు ఉక్రెయిన్‌వాసులు, 14 మంది ఫిలిప్పీన్స్ పౌరులు ఉన్న హాన్సా అనే ఈ నౌకను విడుదల చేసేందుకు పైరేట్లు భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారు.
వీరి డిమాండ్‌లకు తలొగ్గి సంబంధిత యంత్రాంగం 2.4 మిలియన్ డాలర్ల లంచాన్ని పైరేట్లకు చెల్లించింది. లంచం అందుకున్న పైరేట్లు ఓ వార్తా సంస్థతో ఫోన్‌లో మాట్లాడుతూ.. తామిప్పుడు వాటాలు పంచుకుంటున్నామని, ఇది పూర్తికాగానే నౌకను వదిలివెళతామని తెలిపారు. ఈ నౌకను పేరేట్లు ఏప్రిల్ 4న హైజాక్ చేయడం గమనార్హం.
ఇదిలా ఉంటే 11 మంది ఇండోనేషియా పౌరులు ఉన్న మరో నౌకను కూడా ఇటీవల పైరేట్లు లంచం పొందిన తరువాత విడిచిపెట్టారు. మలేషియాకు చెందిన ఈ నౌక ఏడు నెలలపాటు పైరేట్ల ఆధీనంలో ఉంది.
ఆసియా, యూరప్ ఖండాల మధ్య ప్రధాన సముద్ర మార్గాన్ని ఆసరాగా చేసుకొని సోమాలియా పైరేట్లు గత కొన్నేళ్లుగా నౌకలను హైజాక్ చేస్తూ భారీ మొత్తాల్లో లంచాలు వసూలు చేస్తున్నారు. హిందూ మహాసముద్రంలో, గల్ఫ్ ఆఫ్ అడెన్‌లలో పైరేట్లు వాణిజ్య నౌకలను హైజాక్ చేస్తున్నారు.