పాకిస్థాన్ మాజీ మిలిటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ఆ దేశ సుప్రీంకోర్టు సమన్లను బేఖాతరు చేశారు. దేశంలో రెండేళ్ల క్రితం అత్యాయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించడంతోపాటు, న్యాయమూర్తులను తొలగిస్తూ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ముషారఫ్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సమన్లను మాజీ అధ్యక్షుడు ముషారఫ్ బేఖాతరు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ ముహమ్మద్ చౌదరి నేతృత్వంలోని 14 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం కోర్టు ఎదుట హాజరుకావాలని ముషారఫ్‌కు నోటీసు జారీ చేసింది. అయితే బుధవారం జరిగిన విచారణకు ముషారఫ్ లేదా అతని తరపు న్యాయవాది ఎవరూ హాజరుకాలేదు.
ముషారఫ్ తరపున వాదించేందుకు కోర్టుకు ఎవరైనా వచ్చారా అని న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నకు నిశ్శబ్దమే సమాధానమైంది. ముషారఫ్ హయాంలో ప్రభుత్వం అటార్నీ జనరల్‌గా పనిచేసిన మాలిక్ ఖయ్యుం కూడా విచారణ సమయంలో కోర్టులోనే ఉన్నారు. అయితే ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు. ముషారఫ్ ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది.