పాకిస్థాన్‌కు అమెరికా ఇచ్చే సాయంలో కోత విధిస్తే ఇప్పటికే ఆర్ధిక ఇప్పందుల్లో ఉన్న తమ దేశంలో అమెరికా పట్ల వ్యతిరేక భావన హెచ్చుమీరే అవకాశం ఉందని ఇస్లామాబాద్ పేర్కొంది.
"సాయంలో కోత ప్రస్తుతం ఉన్న మా ఆర్ధిక పరిస్థితులపై మాత్రమే ప్రభావం చూపకుండా అమెరికా ప్రభుత్వం పట్ల పాకిస్థాన్ ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది" అని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తమ దేశ పర్యటనకు వచ్చిన అమెరికా సెనెట్ ప్రతినిధుల బృందంతో పేర్కొన్నారు. పాకిస్థాన్‌కి ఇచ్చే సాయంలో కోత విధించకుండా అమెరికా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకుంటారని జర్దారీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకొని పాకిస్థాన్‌కు వచ్చిన సెనేటర్లు పాక్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ, సైన్యాధ్యక్షుడు అస్ఫక్ పర్వేజ్ కయానీలతో కూడా భేటీ అయినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. పాకిస్థాన్‌కు అందించే పౌర సాయంలో కోతకు సంబంధించిన బిల్లును అమెరికా పార్లమెంట్ విదేశీ వ్యవహారాల కమిటీ గత నెలలో ఆమోదించింది.