గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ ప్రభుత్వం కుదుర్చుకున్న వరుసగా శాంతి ఒప్పందాలు ఆఫ్ఘనిస్థాన్, పాక్‌లలో తాలిబాన్ తీవ్రవాదులు పునరుత్తేజం పొందేందుకు దోహదపడ్డాయని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి రాబర్ట్ గేట్స్ అభిప్రాయపడ్డారు. తాలిబాన్లు పునరుజ్జీవనం పొందేందుకు వారితో పాక్ ప్రభుత్వం శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడమే కారణమని గేట్స్ పేర్కొన్నారు.
పాకిస్థాన్ ప్రభుత్వం వారి పశ్చిమ సరిహద్దుల్లో వివిధ తీవ్రవాద గ్రూపులతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడంతో తాలిబాన్ల పునరుజ్జీవనం ప్రారంభమైందని చెప్పారు. ఈ ఒప్పందాలతో వారికి స్వేచ్ఛ లభించింది. అంతేకాకుండా వారు స్థావరాలు ఏర్పరుచుకునేందుకు ఆస్కారం ఇచ్చిందని తెలిపారు.
ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం సమస్యాత్మక స్వాత్ లోయ ప్రాంతంలో తాలిబాన్ తీవ్రవాదులపై సైనిక చర్యకు దిగడంపై గేట్స్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదులతో శాంతి ఒప్పందాలకు పాక్ ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు ఈ సైనిక చర్యతో శుభంకార్డు పడిందన్నారు. జాతి మనుగడకు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచివుందనే విషయం ఇప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసొచ్చిందన్నారు.