లాహోర్లో శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన ఉగ్రవాద దాడి సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోకుండా పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ (ఎన్ఏ) స్పోర్ట్స్ స్టాండింగ్ కమిటీపై అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మంత్రులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక జట్టుకు పేలవమైన భద్రత కల్పించినట్లు ఆరోపణలు వచ్చాయి.
లాహోర్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఉగ్రవాద దాడి క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. మార్చి 3న జరిగిన లాహోర్ ఉగ్రవాద దాడిలో ఏడుగురు శ్రీలంక క్రికెటర్లు గాయపడ్డారు. వారికి రక్షణగా ఉన్న ఎనిమిది మంది స్థానిక పోలీసులు మృతి చెందారు. ఈ దాడి సందర్భంగా పలువురు లాహోర్ పోలీసుల అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
నిర్లక్ష్యవైఖరిని కనబర్చిన పోలీసు ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని లాహోర్ దాడిపై దర్యాప్తు జరుపుతున్న స్టాండింగ్ కమిటీపై ఓ పీపీపీ మంత్రి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్ కేంద్ర మంత్రి ఒకరు దర్యాప్తు విషయంలో కమిటీ నిదానంగా వెళ్లాలని ఆ మంత్రి ఒత్తిడి తెస్తున్నారని వార్తా కథనాలు పేర్కొన్నాయి.