అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నాడని వస్తున్న ఆరోపణలను ఆ దేశ మంత్రి ఒకరు తోసిపుచ్చారు. పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో లాడెన్ ఉంటున్నాడని అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు భావిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాక్ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ఖమర్ జమన్ కైరా మాట్లాడుతూ.. పాకిస్థాన్ భౌగోళిక సరిహద్దుల్లో లాడెన్ ఉంటున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. లాడెన్ తమ భూభాగంలో ఉన్నాడనేందుకు ఆధారాలేమీ లేవని తెలిపారు. లాడెన్ ఇక్కడ ఉన్నాడనేందుకు నిర్మాణాత్మక ఆధారాలేమీ లేవన్నారు.
పాకిస్థాన్‌లో బ్రిటన్ హైకమిషనర్‌గా పనిచేస్తున్న సర్ రాబర్ట్ బ్రిక్లే ఇటీవల లాడెన్, అల్ ఖైదా రెండో అగ్రనేత అయమన్ అల్ జవహిరి, తాలిబాన్ చీఫ్ ముల్లా ఒమర్ పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో తలదాచుకుంటున్నారని ఆరోపించారు.
దీనిపై మంత్రి మాట్లాడుతూ.. ఇటువంటి ప్రకటనలు పుకార్లను ఆధారంగా చేసుకొని చేయరాదన్నారు. బలమైన ఆధారాలతో ఇటువంటి ప్రకటనలు చేయాలని సూచించారు.