శ్రీలంకలో రెండు దశాబ్దాలపాటు ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ప్రత్యేక తమిళ దేశం కోసం జరిగిన అంతర్యుద్ధం కారణంగా నిరాశ్రయులైన వేలాది మంది తమిళ పౌరుల సహాయార్థం భారత ప్రభుత్వం సోమవారం ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.500 కోట్ల నిధులు కేటాయించింది. శ్రీలంక తమిళ పౌరుల పునరావాస కార్యక్రమాలకు ఈ నిధులు ఉపయోగిస్తారు.
భారత పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం 2009-10 సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో లంక తమిళుల కోసం కూడా నిధులు కేటాయించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీలంకలో తమిళ పౌరుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని బడ్జెట్ ప్రసంగంలో ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.
శ్రీలంక రాజ్యంగం కల్పించిన హక్కులు తమిళుల పొందేలా కృషి చేస్తామన్నారు. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన తమిళ పౌరుల పునరావాస కార్యక్రమాలపై శ్రీలంక ప్రభుత్వంపై భారత విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ ప్రకారం.. శ్రీలంక తమిళులకు నిధుల కేటాయింపు జరిగిందని విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ చెప్పారు.