మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత వైద్యుడిని లాస్ ఏంజెలెస్ పోలీసులు శనివారం మరోసారి ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మైఖేల్ కుటుంబ సభ్యులు ప్రైవేట్‌గా ఆయన భౌతికకాయానికి మరోసారి శవపంచనామా జరపాలని కోరారు. దీంతో పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ భౌతికకాయానికి వైద్యులు రెండోసారి శవపంచనామా నిర్వహించారు.
మైఖేల్ జాక్సన్ భౌతికకాయానికి శుక్రవారం అధికారికంగా ఒకసారి శవపంచనామా జరిగింది. అయితే మైఖేల్ హఠాన్మరణం అనేక అనుమానాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆయన బలవంతంగా మందులపై ఆధారపడేటట్లు కుట్ర జరిగిందని, ప్రిస్క్రిప్షన్ మందుల వలనే ఆయన మరణించారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు మైఖేల్ భౌతికకాయానికి ప్రైవేట్‌గా రెండోసారి శవపంచనామా నిర్వహించాలని కోరారు. మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత వైద్యుడు కర్నార్డ్ ముర్రేను లాస్ ఏంజెలెస్ పోలీసులు శనివారం మరోసారి ప్రశ్నించారు. పోలీసులు చాలాసేపు ముర్రేను విచారించారు. గురువారం మైఖేల్ మరణించిన సమయంలో ముర్రే ఆయన నివాసంలోనే ఉన్నారు.
మైఖేల్ జాక్సన్ చివరి నిమిషాల్లో జరిగిన పరిణామాలకు ముర్రే ప్రత్యేక్ష సాక్షి మాత్రమేనని, అనుమానితుడు కాదని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. జాక్సన్ మరణం వివాదాస్పదం కావడంతో ముర్రే పోలీసుల దర్యాప్తులో ఉపయోగకరంగా ఉండేందుకు న్యాయవాదిని నియమించుకున్నారు.
రెండు రోజుల క్రితం పాప్ కింగ్ గుండెపోటుతో మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆయన అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. జాక్సన్ మరణంపై ఆయన తండ్రి మాట్లాడుతూ.. అభిమానులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. మైఖేల్ జాక్సన్ మీ అందరికోసం జీవిస్తూనే ఉంటాడని తెలిపారు.