పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు నెవర్‌లాండ్ ఎస్టేట్ చేయాలనే ఆలోచనను ఆయన కుటుంబసభ్యులు విరమించుకున్నారు. మైఖేల్ జాక్సన్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న నెవర్‌లాండ్ ఎస్టేట్‌లోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని చాలామంది భావిస్తూ వచ్చారు. అయితే మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు నెవర్‌లాండ్‌లో జరగవని కుటుంబవర్గాలు తెలిపాయి.
అంత్యక్రియలు జరిగే ప్రదేశంపై ఇప్పటికీ ఎటువంటి సమాచారం లేదు. మైఖేల్ అంత్యక్రియలు జులై 5న జరుగుతాయని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి అభిమానుల సందర్శనార్థం మైఖేల్ జాక్సన్ భౌతిక కాయాన్ని నెవర్‌లాండ్ ఎస్టేట్‌లో ఉంచనున్నారు.
నెవర్‌లాండ్ ఎస్టేట్‌లో మైఖేల్ అంత్యక్రియలు జరగకపోవడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2002లో మైఖేల్ జాక్సన్ సంతకం చేసినట్లు భావిస్తున్న వీలునామాను బుధవారం లాస్ ఏంజెలెస్ సుపీరియర్ కోర్టులో ప్రవేశపెట్టారు.
ఈ వీలునామాలో నెవర్‌లాండ్ ఎస్టేట్‌ను మైఖేల్ జాక్సన్ తన కుటుంబ ట్రస్టుకు అప్పగించారు. తన పిల్లల సంరక్షణ బాధ్యతలను తన తల్లి కేథరీన్ జాక్సన్ చేపట్టాలని, ఆమెకు ఏదైనా జరిగిన పక్షంలో తన చిరకాల స్నేహితురాలు డయానా రాస్‌కు పిల్లల సంరక్షణ బాధ్యతలు అప్పగించాలని మైఖేల్ జాక్సన్ ఈ వీలునామాలో రాశారు.