ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న దాడుల పరంపర కొనసాగుతోంది. ఆ దేశంలోని ముఖ్య నగరాల్లో ఒకటైన మెల్‌బోర్న్ నగర శివార్లలో మరో భారతీయ విద్యార్థిపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
"ది ఏజ్" పత్రిక కథనం మేరకు... 20 సంవత్సరాల సన్నీ బజాజ్‌ను జాతి వివక్షతో దూషించిన కొందరు దుండగులు ఆ తర్వాత చేయి చేసుకున్నట్టు పేర్కొంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కారులో వెళుతున్న బజాజ్‌పై ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్టు ఆ పత్రిక పేర్కొంది.
దాడి ఘటనపై బజాజ్ మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు తన వద్దకు వచ్చి డబ్బులు అడగగా, తాను లేవని చెప్పాను. దీంతో వారు నాపై దాడి చేశారని డీకిన్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేస్తున్న ఈ విద్యార్థి వివరించినట్టు ది ఏజ్ తెలిపింది.
దాడి చేయడమే కాకుండా అసభ్యంగా తిట్టారని, గట్టిగా కొట్టడంతో నోటి నుంచి నెత్తురు కూడా వచ్చినట్టు బజాబ్ వివరించాడు. దాడికి పాల్పడిన వారు 20 సంవత్సరాల వయస్సు కలిగి వుంటారని, వీరిద్దరిలో ఒకడు తెల్లగా ఉండగా, మరో వ్యక్తి ఆఫ్రికన్‌ను పోలి వుంటాడని తెలిపాడు.
కాగా, గత నెల కాలంలో ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులపై ఇప్పటి వరకు జరిగిన దాడుల సంఖ్య 14కు చేరుకుంది. ఈ తాజా దాడిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.