సెంట్రల్ మెక్సికోలోనే ఓ నగరంలో మోస్ట్‌వాంటెడ్ డ్రగ్ ముఠాకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలపై 92 మంది పోలీసులను అరెస్టు చేశారు. మెక్సికో అధికారిక యంత్రాంగం అరెస్టు చేసినవారిలో ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా ఉన్నారు. దేశంలోని హిడాల్గో రాష్ట్ర రాజధాని పాచుకాలో ఈ తాజా సంచలనం చోటుచేసుకుంది.
అనేక హింసాత్మక చర్యల్లో ప్రమేయం ఉన్న డ్రగ్ ముఠాకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై పాచుకా పోలీసు చీఫ్, ఇతర పోలీసు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ డ్రగ్ ముఠాకు చెందిన సాయుధ విభాగం "జెతాస్"కు వీరు ఆశ్రయం ఇచ్చారని మెక్సికో ఫెడరల్ పోలీస్ ఇంటెలిజెన్స్ సమన్వయకర్త లూయిస్ కార్డెనాస్ విలేకరులతో చెప్పారు.
మెక్సికో ప్రభుత్వం 1990వ దశకంలో డ్రగ్ ముఠాల ఆటకట్టించేందుకు "జెతాస్" అనే సాయుధ విభాగాన్ని ఏర్పాటు చేసింది. డ్రగ్ ముఠాలను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వం జెతాస్‌లకు ప్రత్యేక సైనిక శిక్షణ కూడా ఇచ్చింది. అనంతరం జెతాస్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీరిలో కొందరు ప్రభుత్వ విధులను గాలికొదిలేసి డ్రగ్ ముఠాలతోనే చేతులు కలిపారు.
వీరు కూడా జెతాస్ పేరుతోనే సాయుధ విభాగాన్ని నడపడం మొదలుపెట్టారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న వ్యక్తుల కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలపై ఇటీవల మెక్సికోలోని నాలుగు జిల్లాల్లో పది మందికిపైగా ఆర్మీ సైనికులను, పోలీసు అధికారులను అరెస్టు చేశారు.
వీరందరూ డ్రగ్ రవాణాకు సహకరిస్తున్నారని అభియోగాలు నమోదయ్యాయి. రెండున్నరేళ్ల క్రితం దేశంలో డ్రగ్ ముఠాలను అణిచివేసేందుకు అధ్యక్షుడు ఫిలిప్ కాల్డెరన్ సైనిక చర్యకు ఆదేశించారు. అనంతరం దీనికి సంబంధించి జరుగుతున్న హింసాకాండలో 10 వేల మందికిపైగా పౌరులు మృతి చెందారు.